Daughter Taking Care Mother : తోటి పిల్లలతో సరదాగా ఆడుకోవాల్సిన వయసు. బడికెళ్లి పాఠాలు వినాల్సిన సమయం. కానీ విధి ఆ చిన్నారిని చిన్నచూపు చూసింది. తండ్రి ఇంటిని వదిలేసి వెళ్లిపోగా, తొమ్మిదేళ్లుగా తల్లి మంచానికే పరిమితమైంది. కదల్లేని స్థితిలో ఉన్న తల్లికి సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ కన్న తల్లికి అమ్మగా మారింది ఆ పదకొండేళ్ల చిన్నారి. కడు పేదరికంతో కనీసం తినడానికి సరైన తిండిలేక, వైద్యానికి డబ్బుల్లేక ఆపన్నహస్తం కోసం దీనంగా ఎదురు చూస్తోంది ఆ కుటుంబం.
అమ్మకు అన్నీ తానై సేవలు చేస్తున్న 11 ఏళ్ల పాప : సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం గుండ్లసింగారం గ్రామానికి చెందిన షేక్ సయ్యద్ పాషా, సలీమా దంపతులకు కుమార్తె రిజ్వానా, కుమారుడు సమీర్ ఉన్నారు. పిల్లలకు ఊహ తెలియని వయసులోనే తండ్రి ఇళ్లొదిలి వెళ్లిపోయాడు. అనుకోని ప్రమాదంతో తొమ్మిదేళ్లుగా తల్లి మంచానికే పరిమితమైంది. ఇటీవల ఇందిరమ్మ ఇంటి సర్వే కోసం అధికారులు వెళ్లగా, రేకుల ఇంటి ముందు ఓ చిన్నారి దీనంగా కూర్చొని కనిపించింది. కుటుంబ సభ్యులను పిలవాలని అధికారులు ఆ చిన్నారికి చెప్పగా, అమ్మ బయటికి రాదని, అమ్మ నడవలేదని, కావాలంటే తానే నిలబడతా ఫొటో తీయండి అని అధికారులకు చెప్పింది. విషయం ఆరా తీసిన అధికారులు, ఆ కుటుంబ దీన స్థితి చూసి చలించిపోయారు.
"ప్రతి రోజు ఈ పాప వాళ్ల అమ్మకు సేవలు చేసుకుని బడికి రావాల్సి వస్తుంది. మధ్యాహ్నం వెళ్లి వాళ్ల అమ్మను చూసుకుని వస్తుంది. ఏ ఆధారం లేదు. తన బాల్యాన్ని కూడా కోల్పోతోంది. వీరి పరిస్థితి దయనీయంగా ఉంది. కనుక ఈ పాప కుటుంబానికి చేతనైనంత సాయం చేయాలని మా పాఠశాల తరఫున కోరుతున్నాం" - కృష్ణవేణి, ఉపాధ్యాయురాలు
నిత్యం తల్లికి సపర్యలు చేస్తూ : మంచానికే పరిమితమైన తల్లి సలీమాకు కుమార్తె రిజ్వానా అమ్మగా మారింది. మంచంలో కదల్లేని స్థితిలో ఉన్న తల్లికి నిత్యం సపర్యలు చేస్తోంది. కనీసం మంచం కూడా దిగలేని స్థితిలో ఉన్న తల్లికి, ఆ గదిలోనే అన్ని సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు లేని స్థితి వారిది. ఆరో తరగతి చదువుతున్న రిజ్వానా తల్లిని చూసుకుంటూ బడికి వెళ్తోంది.
ప్రతి రోజూ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ఇంటికి వచ్చి తల్లికి అన్నం వండి తినిపించి వెళ్తుంది. రాత్రి పూట చుట్టుపక్కల ఇళ్ల వద్దకు వెళ్లి భోజనం తెచ్చి అమ్మ ఆకలి తీరుస్తోంది ఆ చిన్నారి. అటు బడికి వెళ్తూ, ఇటు తల్లిని చూసుకోవడం ఇబ్బందిగా మారిందని ఇంటికి వెళ్లిన అధికారులకు దీనంగా చెప్పింది రిజ్వానా. చిన్నారి పరిస్థితి చూసిన అధికారుల కళ్లు చెమర్చాయి. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. చిన్నారి కుటుంబం దీన స్థితి చూసిన నూతనకల్ ఎంపీడీవో, తహసీల్దార్‌లు కుటుంబాన్ని సందర్శించి బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు.
ఆదుకోండయ్యా : ఏడాదిన్నర క్రితం తండ్రి - ఇటీవల తల్లి మృతి - అనాథలైన ఐదుగురు చిన్నారులు
బాధ్యత చూసేవాడే బరువయ్యాడు - ఆపన్నహస్తం కోసం ఆ పేద కుటుంబం ఎదరుచూపులు