High Court On Game Changer Tickets Price : గేమ్ ఛేంజర్ టికెట్ల ధరలు, ప్రత్యేక ప్రదర్శనలపై హైకోర్టులో విచారణ జరిగింది. సినిమా ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ, ప్రత్యేక షోలకు అనుమతులేంటి? అని ప్రశ్నించింది. తెల్లవారుజామున షోలకు అనుమతిపై పునః సమీక్షించాలన్న హైకోర్టు, ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తాను ఆదేశించింది. భారీ బడ్జెట్‌తో తీసి నిర్మాతలు ప్రేక్షకుల నుంచి డబ్బును వసూలు చేయాలనుకోవడం సరికాదని హితువు పలికింది.
సినిమాటోగ్రఫి చట్టాన్ని ఉల్లంఘిస్తూ టికెట్ల ధరల పెంపు, అదనపు షోలకు హోంశాఖ అనమతి ఇస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. 2021లో జారీ అయిన జీఓ ప్రకారమే టికెట్ల ధరలు ఉండాలి, కానీ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీ చేసిన మెమో ఆధారంగా అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పెంచిన టికెట్ ధరలు ఈ నెల 19వ తేదీ వరకే ఉంటాయని హోంశాఖ జీపీ కోర్టుకు చెప్పారు.
పుష్ప-2 బెనిఫిట్ షో ప్రస్తావన : ఇటీవల పుష్ప-2 చిత్రానికీ సైతం టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారని, బెనిఫిట్ షో వల్ల చోటు చేసుకున్న ప్రమాదాన్ని పిటిషనర్ న్యాయవాది కోర్టుకు గుర్తుచేశారు. బెనిఫిట్ షోలను అనుమతించేది లేదని ప్రభుత్వం ప్రకటించినా, స్పెషల్ షోలకు మాత్రం ఉత్తర్వులిస్తున్నారని వాదనలు వినిపించారు.
ప్రత్యేక షో కూడా బెనిఫిట్ షో లాంటిదే? : స్పెషల్ షోలకు ఉత్తర్వులివ్వడం బెనిఫిట్ షో లాంటిదేనని న్యాయమూర్తి అన్నారు. అర్ధరాత్రి వేళ షోలకు అనుమతిస్తే ఇంటికి వచ్చే సరికి ఎంత సమయం అవుతుందని హైకోర్టు జీపీని ఘాటుగా ప్రశ్నించింది. అభివృద్ధి అంటే అర్ధరాత్రి తర్వాత బయట తిరగడం కాదని, సమయానికి నిద్రపోవడం కూడా ముఖ్యమే కదా! అని హైకోర్టు పేర్కొంది. ప్రేక్షకుల భద్రతనూ దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.
High Court Hearing on Game Changer Special Shows : గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. గొర్ల భరత్ రాజ్ అనే వ్యక్తి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. జనవరి 10వ తేదీన ఉదయం 4.30 గంటలకు సినిమా ప్రదర్శనకు అనుమతివ్వడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ధరలు పెంచకుండా ఆదేశించండి : టికెట్ ధరల పెంపు కూడా నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ వాదించారు. గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ పెంపుపై ఉత్తర్వులివ్వకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. హైకోర్టు స్పందిస్తూ తరచూ ఇలాంటి మెమోలు ఎందుకిస్తున్నారని ప్రశ్నించింది. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. నేడు మరోమారు విచారణ చేపట్టిన ధర్మాసనం, ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
బెనిఫిట్ షోలకు నిరాకరణ : దిల్ రాజు నిర్మాతగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. అర్థరాత్రి 1 గంట బెనిఫిట్ షోలకు మాత్రం ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. జనవరి 10న వేకువజామున 4 గంటల నుంచి 6 షోలకు అనుమతించింది.
రోజుకి 5 షోలు : జనవరి 10న మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై అదనంగా రూ.150, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై అదనంగా రూ. 100 చొప్పున పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. జనవరి 11 నుంచి రోజూ 5 షోల నిర్వహణకు అనుమతిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెల 11 నుంచి 19 వరకూ మల్టీప్లెక్సులలో టికెట్‌పై అదనంగా రూ. 100, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ అదనంగా రూ. 50 రూపాయల చొప్పున ధరలు పెంచుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు(వెంకటేశ్వర రెడ్డి)కు అనుమతి ఇచ్చింది.