Dhana Laxmi Puja Vidhanam in Telugu : చీకటిని తరిమి జీవితంలో వెలుగులు నింపే పండగ దీపావళి. కొత్త దుస్తులు, పిండి వంటలు, పూజలు, బాణసంచా వెలుగులు.. ఇవన్నీ దీపావళి వేళ ఉండాల్సిందే. ఇక పండగ సాయంత్రం లక్ష్మీ పూజ అనంతరం పెద్ద వాళ్లు కూడా పిల్లలుగా మారి బాణసంచా మోతలు మోగిస్తారు. మరి ఈ సంవత్సరం దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి? లక్ష్మీ పూజ టైమింగ్స్, పూజా విధానం వంటి పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
దీపావళి ఎప్పుడు:పండగ తిథి ఈ సంవత్సరం(2024) రెండు రోజులు వచ్చిందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. అక్టోబర్ 31వ తేదీ ఉదయం నరక చతుర్దశి తిథి ఉండగా.. అదే రోజు మధ్యాహ్నం 3.45 గంటల నుంచి నవంబర్ 1వ తేదీ శుక్రవారం సాయంత్రం 6.15 అమావాస్య ఘడియలు ఉన్నాయని అంటున్నారు. అయితే మహానిశి లక్ష్మీ పూజ, ధనలక్ష్మీ పూజ, బాణసంచా కాల్చుకోవడం వంటివన్నీ కూడా రాత్రికి అమావాస్య ఉండాలని ధర్మ శాస్త్రం చెబుతోందని.. కాబట్టి అక్టోబర్ 31వ తేదీ రాత్రి అమావాస్య ఉన్నందున ఆరోజు రాత్రికి లక్ష్మీ పూజ, అర్థరాత్రి మహానిశి లక్ష్మీ పూజ చేసుకోవాలని సూచిస్తున్నారు. బాణాసంచాలు కూడా ఆ రోజే కాల్చుకోవాలని వివరిస్తున్నారు.
అయితే చాలా మందికి నవంబర్ 1 చేసుకోకూడదా అని సందేహం వస్తుంటుంది. దానికీ సమాధానమిస్తున్నారు మాచిరాజు కిరణ్ కుమార్నవంబర్ 1వ తేదీన కూడా దీపావళి జరుపుకోవచ్చని.. కానీ పితృకార్యాలు అంటే ప్రతిరోజూ పితృ దేవతలకు తర్పణాలు వదిలేవారు నవంబర్ 1వ తేదీ శుక్రవారం చేసుకోవచ్చని.. అలాంటి నియమాలు లేని వారు అక్టోబర్ 31వ తేదీ గురువారం రోజు పండగ చేసుకోవాలని చెబుతున్నారు.
తైలాభ్యంగన స్నానం ఎప్పుడు చేయాలి:నరక చతుర్దశి రోజున తైలాభ్యంగన స్నానం చేయాలని మాచిరాజు చెబుతున్నారు. నరక చతుర్దశి తైలాభ్యంగన స్నానం అంటే తల్లుల్లు.. పిల్లల మాడు మీద నువ్వుల నూనె రాసి తలంటు స్నానం చేపించడాన్నే తైలాభ్యంగన స్నానం అంటారు. పిల్లలు మాత్రమే కాకుండా పెద్దలు కూడా మాడుకు నూనె రాసుకుని తలస్నానం చేయాలి. ఏ సమయంలో చేయాలంటే.. అక్టోబర్ 31వ తేదీ గురువారం రోజున చేయాలంటున్నారు. అది కూడా తెల్లవారుజామున 4.45 గంటల నుంచి తెల్లవారుజామున 5.45 గంటల మధ్య ఈ స్నానం చేయాలని సూచిస్తున్నారు. అదే విధంగా స్నానం చేసే నీటిలో కొద్దిగా పెరుగు కలిపి చేస్తే మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు.