Kangana Ranaut Emergency Trailer : స్వీయ దర్శకత్వంలో కంగనా రనౌత్ నటించిన చిత్రం 'ఎమర్జెన్సీ'. పలుమార్లు విడుదల వాయిదా పడిన ఈ సినిమా జనవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఎమర్జెన్సీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ప్రేక్షకులకు సినిమాపై మరింత అంచనాను పెంచేసింది.
ఆసక్తిగా సాగిన ట్రైలర్
ట్రైలర్లో ఇందిరా గాంధీగా కంగన రనౌత్ తన నటన, హావభావాలతో ఆకట్టుకున్నారు. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌తో ఇందిరాగాంధీ పాత్రలో లీనమయ్యారు. అలాగే అనుపమ్ ఖేర్ సహా ఇతర పాత్రదారులను చక్కగా చూపించారు.
సంతోషంగా ఉందన్న కంగనా రనౌత్
ట్రైలర్ విడుదల సందర్భంగా కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సవాళ్లతో నిండిన పొలిటికల్ డ్రామా విడుదలకు సిద్ధమైందని తెలిపారు. ఎట్టకేలకు 'ఎమర్జెన్సీ' సినిమా పెద్ద తెరపైకి రాబోతున్నందుకు సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. "ఈ కథ కేవలం వివాదాస్పద నాయకురాలి గురించి మాత్రమే కాదు. ఇది ప్రస్తుత రాజకీయ అంశాలను తెలియజేస్తుంది. గణతంత్ర దినోత్సవానికి కేవలం ఒక వారం ముందు సినిమా విడుదల చేస్తున్నాము. ఈ సినిమా దేశ రాజ్యాంగం గొప్పతనాన్ని తెలియజేస్తుంది. అలాగే మీ ప్రియమైనవారితో ఈ సినిమాను చూసేందుకు ఇదే సరైన సమయం" అని కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు.
'దేశంలో అత్యంత పవర్ ఫుల్ మహిళ చరిత్ర'
అలాగే తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ ఖాతాలో ఎమర్జెన్సీ ట్రైలర్‌ను పోస్టు చేశారు కంగన. '1975 ఎమర్జెన్సీ- భారత చరిత్రలో నిలిచిపోయే అధ్యాయం. భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళ చరిత్ర. ఆమె ఆశయం దేశాన్ని మార్చింది. కానీ ఆమె విధించిన ఎమర్జెన్సీ దేశాన్ని గందరగోళంలోకి నెట్టింది" అని ఎక్స్ పోస్టులో కంగనా రనౌత్ పేర్కొన్నారు.
'ఎమర్జెన్సీ సినిమా ప్రజాస్వామ్య పునరుజ్జీవానికి ప్రతిబింబం'
దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తవుతోందని చిత్ర నిర్మాత ఉమేశ్ కేఆర్ బన్సల్ తెలిపారు. ఎమర్జెన్సీ సినిమా కేవలం చారిత్రక కథాంశం మాత్రమే కాదని, ప్రజాస్వామ్య పునరుజ్జీవనానికి ప్రతిబింబమని కొనియాడారు. దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి పోరాడిన వారికి నివాళి అని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అభిప్రాయపడ్డారు.
ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల ఆధారంగా
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను సినిమాలో ప్రముఖంగా చూపించనున్నారు. అయితే ఈ సినిమా ప్రచార చిత్రాలు విడుదలైనప్పటి నుంచే చిత్రంపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. తమ గురించి తప్పుగా చిత్రీకరించారంటూ ఓ వర్గం సెన్సార్ బోర్డుకు లేఖ కూడా రాసింది. దీంతో సెన్సార్ బోర్డు ఈ సినిమాకు సంబంధించి పలు సన్నివేశాల్లో అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే సెన్సార్ బోర్డు సూచనలకు నిర్మాణ సంస్థ కూడా అంగీకరించడం వల్ల ఎమర్జెన్సీ విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. జనవరి 17న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
'ఎమర్జెన్సీ'లో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్, జయప్రకాశ్ నారాయణ్‌గా అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయాస్ తల్పాడే, ఫీల్డ్ మార్షల్ శామ్ మానేక్షాగా మిలింద్ సోమన్, పుపుల్ జయకర్ పాత్రలో మహిమా చౌదరి నటించారు. జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.