Ballaleshwar Pali Ganesh Temple : మహారాష్ట్రలోని అష్ట వినాయక క్షేత్ర దర్శనంలో భాగంగా మూడవ క్షేత్రం బల్లాలేశ్వర్ క్షేతంలో వినాయకుడు ఆపద్భాంధవుడిగా ప్రసిద్ధి చెందాడు. ఈ స్వామిని దర్శిస్తే ఎంతటి కష్టమైనా, ఎలాంటి ఆపదలైన తొలగిపోతాయని విశ్వాసం.
బల్లాలేశ్వర క్షేత్రం ఎక్కడ ఉంది?
అష్ట వినాయక క్షేత్రాలలో మూడవదైన బల్లాలేశ్వర క్షేత్రం మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో రోహా నుండి 28 కి.మీ దూరంలో ఉన్న పాలీ గ్రామంలో ఉంది. ఇది సరస్‌గడ్ కోట అంబా నదికి మధ్యలో ఉంది.
ఆలయ చరిత్ర
1640లో మోరేశ్వర్ విఠల్ సింద్కర్ ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది. 'శ్రీ' అనే అక్షరం ఆకారంలో ఈ ఆలయంలో నిర్మించారు. ఉదయాన్నే సూర్యుని కిరణాలు నేరుగా గణపతి విగ్రహంపై ప్రసరించడం గొప్ప విశేషం. ఈ ఆలయంలో వినాయకుడు రాతి సింహాసనంపై ఆసీనుడై భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు.
ఆలయ స్థల పురాణం
పాలీ గ్రామాన్ని పూర్వం 'పల్లిపుర్' అనేవారు. ఈ గ్రామానికి చెందిన కల్యాణ్ అనే వ్యాపారస్థుని కుమారుని పేరు 'బల్లాల్'. చిన్న వయసు నుంచి గొప్ప వినాయక భక్తుడు. బల్లాల్ ప్రతిరోజూ స్నేహితులతో కలిసి అడవికి వెళ్లి అక్కడున్న చిన్న చిన్న రాళ్లనే వినాయకుని మూర్తులుగా భావించి పూజిస్తూ ఉండేవారు. ఆ పసిపిల్లలు పూజలే తమ ఆటలుగా ఆ అడవిలో అమాయకమైన భక్తితో వినాయకుని ఆరాధిస్తూ ఉండేవారు. ఒకరోజు వారికి ఒక పెద్ద రాయి దొరికింది. బల్లాల్ ఆ రాతిని నిజమైన వినాయకుడిగా భావించి భక్తితో పూజలు చేయడం మొదలు పెట్టాడు. ఆ నిర్మలమైన భక్తి పారవశ్యంలో వారు రాత్రి అయింది కూడా గమనించలేదు.
ఇలా ఆ పిల్లలు రాళ్లను, రప్పలను వినాయకులంటూ పూజిస్తూ ఆ ధ్యాసలో ఇల్లు పట్టకుండా అడవిలోనే పొద్దు పోయేవరకు ఉండి రాత్రి సమయంలో ఇల్లు చేరుతుండేవారు. ఆ పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహించి ఇలా రాత్రి వరకు అడవుల్లో ఉండటానికి కారణం బల్లాల్ అని అతని తండ్రి కల్యాణ్‌కు ఫిర్యాదు చేసారు. కల్యాణ్ సహజంగానే ఆ ఊర్లో పెద్ద పేరున్న సేఠ్. తన కుమారుని వల్ల కల్యాణ్‌కు చెడ్డ పేరు రావడం భరించలేక పోయాడు. కోపంతో కల్యాణ్ సేఠ్ తన కుమారుడని కూడా చూడకుండా అడవికి తీసుకుని వెళ్లి, చెట్టుకి కట్టి స్పృహ తప్పేలా కొడతాడు. బల్లాల్ గణపతిగా భావించి పూజిస్తున్న రాతివిగ్రహాన్ని నేలకేసి విసిరికొట్టి ముక్కలు చేస్తాడు. 'ఏ దేవుడు వచ్చి నిన్ను రక్షిస్తాడో చూస్తాను' అంటూ ఆ అడవిలోనే అలా వదిలేసి వెళ్ళిపోతాడు.