Venus Transit In Aquarius 2024 : జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం ఆనందం, శ్రేయస్సు, విలాసాలకు అధిపతిగా చెబుతారు. ప్రతి నెల శుక్రుడు తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. ఈ నేపథ్యంలో శుక్రుడు ప్రస్తుతం ఏ రాశిలో ప్రవేశించనున్నాడు? శుక్ర సంచారం ప్రభావం ఏయే రాశులపై ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం.
కుంభ రాశిలో శుక్రుడు
డిసెంబర్ 28వ తేదీ రాత్రి 11.28 గంటలకు శుక్రుడు మకర రాశిని విడిచి శనీశ్వరుడు కుంభ రాశిలో ప్రవేశిస్తాడు. ఈ ప్రభావంతో నాలుగు రాశుల వారికి శుభ సమయం రానుంది.
మేష రాశి
శుక్రుడు కుంభరాశి లోకి ప్రవేశించిన తర్వాత మేష రాశి వారికి శుభ సమయం మొదలవుతుంది. శుక్ర సమాచారం మేష రాశి వారికి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు జీతభత్యాలు పెరుగుతాయి. అన్ని వర్గాల వారికి మెరుగైన ఆదాయంతో పాటు పెట్టుబడి అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయి. షేర్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలు అందిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త స్నేహితులు ఏర్పడతారు. ప్రేమ సంబంధాలు వివాహ బంధంతో ముడి పడతాయి. సంతానం వలన ఆనందాన్ని పొందుతారు. కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేయడం ఉత్తమం.
మిథున రాశి
కుంభ రాశిలో శుక్రుని సంచారం మిధున రాశి వారికి శుభదాయకంగా ఉంటుంది. ఈ కాలంలో మిథున రాశి వారికి తండ్రి, గురువు , మార్గదర్శకుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. అంతేకాకుండా శుక్రుని ప్రభావం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయి. భూములు, ఇల్లు, ఆస్తిని కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. శ్రీలక్ష్మి దేవిని ప్రార్థిస్తే మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి.
సింహ రాశి
కుంభ రాశిలో శుక్రుడు సంచరించడం సింహ రాశి వారికి అత్యంత శుభదాయకంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం జరుగుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగి సంతోషం నెలకొంటుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. వ్యాపారులు వ్యాపారాన్ని విస్తరించడంలో విజయం సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు పెళ్లి పీటలెక్కుతాయి. ధన కనక వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. శ్రీలక్ష్మీ సహస్రనామ స్తోత్రం పారాయణ ఉత్తమం.
కుంభ రాశి
కుంభ రాశిలో శుక్రుని సంచారం వల్ల ఈ రాశి వారి జీవితంలో పెద్ద మార్పులు కనిపిస్తాయి. ఈ సమయంలో అదృష్టం వీరి సొంతం. లక్ష్మి కటాక్షంతో ఐశ్వర్యవంతులవుతారు. చేపట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. శుక్రుడి ప్రభావం వల్ల ఆరోగ్యం, అందం సొంతమవుతాయి. జీవితంలో నూతన అవకాశాలు అందుకుంటారు. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన శుభకరం.
జ్యోతిష్య శాస్త్రం సూచించే ఈ ఫలితాలను విశ్లేషిస్తూ జీవిత గమనాన్ని సాగిస్తూ శుభ ఫలితాలను అందుకోవాలని ఆశిద్దాం.
శుభం భూయాత్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.