తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Updated : 2 hours ago

ETV Bharat / spiritual

బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం- అంకురార్పణ, విశ్వక్సేన పూజ ఎలా చేస్తారో తెలుసా? - Tirupati Brahmotsavam

Tirupati Venkateswara Swamy Brahmotsavam : తిరుమల శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో 3వ తేదీ జరుగనున్న అంకురార్పణ, విశ్వక్సేన పూజ విశిష్టతను తెలుసుకుందాం.

Venkateswara Swamy Brahmotsavam
Venkateswara Swamy Brahmotsavam (ETV Bharat)

Tirupati Venkateswara Swamy Brahmotsavam : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణంలో వైష్ణవ ఖండంలోని 'శ్రీ వేంకటాచల మాహాత్మ్యం'లో వివరించిన ప్రకారం తొలుత వేంకటేశ్వరునికి సాక్షాత్తూ ఆ బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఉత్సవాలు కాబట్టి ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలని పేరు వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ఎప్పుడు?
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 తేదీ వ‌ర‌కు జరుగనున్నాయి.

అంకురార్పణ
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 3వ తేదీ గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది.

విశ్వక్సేనుల ఉరేగింపు
అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా శ్రీవారి త‌ర‌పున ఆయన సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్సేనుల వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు.

భూపూజ
అనంత‌రం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆల‌యంలోని యాగశాలలో భూమాత‌కు ప్రత్యేక పూజ‌లు నిర్వహించి పుట్టమన్నులో న‌వ‌ధాన్యాలను నాటే కార్యక్రమం జరుగుతుంది. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అంకురార్పణ విశిష్టతను తెలుసుకుందాం.

బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని చేసే కార్యక్రమం
వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యం ఉంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడం సహా, స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ అంకురార్పణ ఘట్టం ప్రధాన ఉద్దేశం.

సూర్యాస్తమయం తర్వాతే!
అంకురార్పణలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే? సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడిని 'సస్యకారక' అంటారు. అంటే పంటలు పండించే వాడని అర్థం. ఈ కారణంగా పగటివేళ కాకుండా సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు.

పాలికలలో పవిత్ర విత్తనాలు
అంకురార్పణంలో పలు పవిత్ర విత్తనాలు నాటుతారు. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా జరుగుతాయని విశ్వాసం. విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. శ్రీనివాసుని ఆలయ ప్రాంగణంలో ఉన్న యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి మహర్షి తన 'సముర్తార్చన అధికరణ' అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని విపులంగా వివరించారు.

దేవతలకు ఆహ్వానం
అంకురార్పణాన కార్యక్రమం జరగడానికి ముందు, ఆ రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మ పీఠాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ తరువాత అగ్నిహోత్రం ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు.

శాస్త్రోక్తంగా అంకురార్పణ
ఆ తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపి, చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణు సూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ సాగుతుంది.

ఇదే కదా మహాభాగ్యమంటే!
అంకురార్పణ కార్యక్రమం ద్వారా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పంపుతూ ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఈ కార్యక్రమం కళ్లారా చూసిన కళ్ళకు భాగ్యం! వినిన చెవులకు మహద్భాగ్యం!

ఓం నమో వెంకటేశాయ!

ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

Last Updated : 2 hours ago

ABOUT THE AUTHOR

...view details