Main Parties Focus on Medak Seat : పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఓటూ ప్రాధాన్యమే. బూత్ స్థాయి నుంచి అన్ని పార్టీలు శ్రేణులను సిద్ధం చేస్తున్నాయి. ప్రచారానికి కొద్ది రోజుల సమయమే మిగిలి ఉండటంతో విస్తృతంగా నాయకులు, అభ్యర్థులు తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు. పగలు ఎండలు మండుతుండటంతో ఉదయం, సాయంత్రం వేళలను సద్వినియోగం చేసుకుంటున్నారు. స్థానిక నేతలు ప్రతి ఓటరునూ కలవాలని కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు. అభ్యర్థి తీరుతెన్నులు, పార్టీ విధివిధానాలు, హామీల గురించి వివరించి కచ్చితంగా తమ పార్టీకే ఓటు వేసేలా చేస్తున్నారు. ప్రచారం సమయం ముగిశాక రాత్రి ఆరోజు జరిగిన తీరు, మరసటి రోజు అందిపుచ్చుకోవాల్సిన అంశంపై ముఖ్యనాయకులు సమావేశమై చర్చిస్తున్నారు.
మెదక్ పార్లమెంట్ పరిధిలో మెుత్తం 2వేల 124 బూత్‌లు ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు బూత్ స్థాయి బాధ్యులను నియమించారు. వారి పరిథిలో 100 ఓట్లుకు ఒకరిని బాధ్యులుగా ఏర్పాటు చేశారు. మూడు పార్టీలకు కలిపి 6వేల 372మంది బూత్ బాధ్యులు, వంద ఓటర్లకు ఒకరు చొప్పున 54 వేల 384 మందితో సహా మెుత్తం 60వేల 756 మంది ముఖ్య కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులకు ప్రచారం నిర్వహిస్తున్న మరో 500 మంది వరకు ఉన్నారు. వారి ద్వారా సమాచార సేకరణ చేస్తున్నారు. నేతలు ఎక్కడ ప్రచారం చేశారు. ఎంత మంది ఓటర్లను కలిశారు. అనే విషయాలను వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి వాటిల్లో పంపించుకుంటున్నారు. సరికొత్త విధానాలతో అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు.
కాంగ్రెస్ రాగానే కరవు వచ్చిందని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. గ్యారంటీలు, రుణమాఫీ అమలు కాలేదని చెబుతోంది. తమ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రూ.100 కోట్లతో ట్రస్ట్ పెట్టి పేదలను ఆదుకుంటారని హామీలు ఇస్తోంది. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ ఏమీ ఇవ్వలేదని, ఆ పార్టీ అభ్యర్థివి మాటలే కానీ చేతలు లేవని బీఆర్ఎస్ నాయకులు విమర్శనాస్తృలు గుప్పిస్తున్నారు.
మంత్రి పదవి చూపించి ఓట్లు అభ్యర్థన :మరో పక్క100 రోజుల తమ పాలనే ఎన్నికలకు రెఫరెండం అని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశామని, ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసితీరుతామంటోంది. బీసీ బిడ్డ నీలం మధుని గెలిపిస్తే ముదిరాజ్ సామాజికవర్గం నుంచి మంత్రి పదవి కేటాయిస్తానని సీఎం రేవంత్ రెడ్డి పలు సభల్లో హామీ ఇచ్చారు. పదేళ్లపాటు దేశంలో ఎక్కడా కల్లోలాలు లేని పాలన సాగించిన ఘనత బీజేపీదేనని, ప్రధాని నరేంద్ర మోదీ రక్షఅని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. గ్రామీణ స్థాయి పురోగతి, శ్రీరాముడికి గుడి, మతపరమైన రిజర్వేషన్లపై వ్యతిరేకత, రాజ్యాంగమే పవిత్ర గ్రంథం అనే అంశాలను వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు.