CM Revanth Reddy Challenge To KCR : కేసీఆర్ అప్పులు అప్పగించినా అధైర్యపడలేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద పాఠశాల 150 వార్షికోత్సవం సందర్భంగా సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజ్వేల్‌లో జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తల జరిగిన సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రూ.7 లక్షల కోట్లు అప్పు చేసి 2023లో మాకు అప్పగించారని, గత ప్రభుత్వం రూ.18వేల కోట్లే రుణమాఫీ చేసిందని, గత ప్రభుత్వం చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని రేవంత్ రెడ్డి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేశామని, రుణమాఫీ చేయలేదంటున్న కేసీఆర్ అసెంబ్లీకి వస్తే లెక్కలు చెబుతామని, ఫామ్‌హౌస్‌లో ఉండి సోది చెప్పటం కాదని, అసెంబ్లీకి రావాలని అన్నారు. లెక్కలు చెబుతామని, ఏ గ్రామంలో ఏ రైతుకు ఎంత రుణమాఫీ చేశామో శాసనసభలో పెడతామని వెల్లడించారు. అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని, నువ్వో నేను చూసుకుందామని సవాల్ విసిరారు.
కేసీఆర్ రద్దైన వెయ్యి నోటుతో సమానం : ప్రజలు తిరస్కరించినా బీఆర్‌ఎస్ మారలేదని, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గుడ్డుసున్నా సీట్లు ఇచ్చారని అన్నారు. కేసీఆర్ పాలమూరును ఎండబెట్టారని తెలిపారు. కేసీఆర్ రద్దైన వెయ్యి నోటుతో సమానమని, ఫామ్‌హౌస్‌లో ఉన్న కేసీఆర్‌కు ప్రజలతో సంబంధాలు తెగిపోయినట్లున్నాయని ఎద్దేవా చేశారు.
విద్యపై చేసేది ఖర్చు కాదు - భవిష్యత్ పెట్టుబడి : రాష్ట్ర బడ్జెట్‌లో రూ.21వేల కోట్లు విద్యాశాఖ కోసం కేటాయించామని రేవంత్‌రెడ్డి తెలిపారు. మొగిలిగిద్ద పాఠశాల అభివృద్ధికి అవసరమైన నిధులు 16 కోట్ల రూపాయలను విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
గత ప్రభుత్వ హయాంలో టీచర్ నియామకాలు జరగలేదని, మా ప్రభుత్వం రాగానే 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. గతంలో నోటిఫికేషన్లు ఇస్తే సంవత్సరాల తరబడి నియామక ప్రక్రియ జరిగేదని, మా ప్రభుత్వం 55 రోజుల్లోనే డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తి చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం వర్సిటీలను నిర్లక్ష్యం చేసిందని, బీఆర్‌ఎస్ హయాంలో వర్సిటీలు పునరావాస కేంద్రాలుగా మారాయని, మా ప్రభుత్వం రాగానే వీసీలను నియమించామని వెల్లడించారు. 21,000 మంది టీచర్లకు పదోన్నతులు కల్పించామని, ఎలాంటి వివాదం లేకుండా 35,000 మంది ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ చేపట్టామని గుర్తు చేశారు.
ఎందరో ప్రముఖులు మొగిలిగిద్ద పాఠశాలలో చదివారని, ఈ పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందనిస విద్యపై చేసేది ఖర్చు కాదని, భవిష్యత్‌పై పెట్టుబడని అన్నారు. విద్యాశాఖను నా దగ్గరే ఉంచుకొని నిత్యం పర్యవేక్షిస్తున్నానని సీఎం తెలిపారు.
"రూ.7 లక్షల కోట్లు అప్పు చేసి 2023లో మాకు అప్పగించారు.అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొను. రైతు భరోసా లెక్కలు చెప్తాను. 60 రోజుల్లోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశాం."- రేవంత్ రెడ్డి, సీఎం
నేను కొడితే మామూలుగా ఉండదు - కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్