Union Minister Kishan Reddy Fires on CM Revanth :కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రిజర్వేషన్ రద్దు ప్రచారం విఫలమైందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రిజర్వేషన్‌లపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు ఖండిస్తున్నారని తెలిపారు. రిజర్వేషన్ లబ్దిదారులే బీజేపీపై విశ్వాసంతో మద్దతు పలుకుతున్నారని పేర్కొన్నారు. ఈమేరకు హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కిషన్‌రెడ్డి, పార్టీ ప్రచారానికి ఊరూరా అద్బుతమైన స్పందన వస్తోందన్నారు.
రాష్ట్రంలో అత్యధిక స్థానాలు కాషాయ పార్టీ గెలువబోతుందన్న కేంద్రమంత్రి, విపక్షాలు చేస్తున్న వ్యతిరేక ప్రచారం తమకు సానుకూలంగా మారుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది బాధ్యతారాహిత్యమైన విమర్శగా కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం ప్రసంగాల్లో అసహనం కనపడుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు.
"కేంద్రంతో బీఆర్ఎస్ పార్టీ ఘర్షణ వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, కానీ తాను ఆ రకంగా చేయనని రేవంత్‌రెడ్డి గతంలో చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని కోరుకుంటున్నాను కావున కేంద్రంతో ఘర్షణ పెట్టుకోకుండా సఖ్యతగా ఉంటానని సీఎం అన్నారు. అలానే రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెస్తానని రేవంత్ నాడు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఉన్నపళంగా బీజేపీతో ఘర్షణ వైఖరిని ఎందుకు ప్రదర్శిస్తున్నారు. గాడిద గుడ్డుతో ఎందుకు ఊరేగుతున్నారు. కేంద్ర సర్కార్‌పై బురద జల్లే విధానంలో ఆ రెండు పార్టీలు ఒకటే వైఖరి అవలంబిస్తున్నాయి."-కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి