Rahul Gandhi Election Campaign in Telangana : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని మోదీ చించేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. పేదలను ధనవంతులను చేస్తానని చెప్పి, అదానీ, అంబానీకి చెందిన రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని ధ్వజమెత్తారు. 30 వేల ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగుల కోసం ఇచ్చామని అన్నారు. రాష్ట్రంలో 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇచ్చామని స్పష్టం చేశారు. గద్వాలలో జరిగిన కాంగ్రెస్ జన జాతర సభలో ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
దేశంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగమని అన్నారు. అందుకుగానూ నిరుద్యోగులకు పక్కాగా ఉద్యోగం వచ్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఈ ప్రణాళిక కోట్ల మంది యువతకు లబ్ధి చేకూరుతుందని చెబుతున్నానన్నారు. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. ఉద్యోగం వచ్చిన సంవత్సరంలో లక్షల రూపాయలు ఖాతాల్లో వేస్తామని మాటిచ్చారు. పెద్ద కంపెనీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీకి చెందిన వారు ఉండరని తెలిపారు.
పేద కుటుంబాల ఖాతాల్లో లక్ష రూపాయలు :కేంద్రంలో అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కింద రోజుకు రూ.400 ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళలు బయట పని చేసిన తర్వాత కూడా ఇంట్లో పని చేస్తున్నారని ఆవేదన చెందారు. తెలంగాణలో మహిళలు 16 గంటలు పని చేస్తున్నారని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేద కుటుంబాల జాబితాను తయారు చేస్తామన్నారు. పేద కుటుంబాలకు చెందిన వారి ఖాతాల్లో లక్ష రూపాయలు వేస్తామని పేర్కొన్నారు. ఉద్యోగాలు సాధించిన వారి ఖాతాల్లో నెలకు రూ.8,500, ఏడాదిలో లక్ష రూపాయాలు వేస్తామన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతులకు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు కనీస మద్దతు ధర ప్రకటిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు.