PM Modi Speech At Warangal Meeting Today : మూడో విడతలోనే ఎన్డీఏ విజయం వైపు పయనిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ ఎక్కడ గెలుస్తుందో బూతద్దంలో వెతకాల్సిన పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల క్రితం బీజేపీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉండేవారని ఆ ఇద్దరు ఎంపీల్లో ఒకరు హనుమకొండ నుంచే గెలిచారని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలను తమ పార్టీని ఎన్నటికీ మరవలేదని వ్యాఖ్యానించారు.
వరంగల్ ప్రజలు ఎప్పుడూ బీజేపీకి మద్దతుగా నిలిచారని ప్రధాని మోదీ అన్నారు. ఈ ప్రాంతం కాకతీయుల విజయ గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు వరంగల్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వరంగల్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. ఆరూరి రమేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని మోదీ కోరారు.
PM Modi Attacks On Congress in Warangal :వికసిత్ భారత్ కావాలని, భారతదేశ ప్రతిష్ఠ ప్రపంచవ్యాప్తం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అస్థిరత, అశాంతి, విపత్తులు నెలకొన్నాయని, భారత్ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ప్రమాదం పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మరోసారి బీజేపీకి ప్రజలు పట్టం కట్టాలని ప్రధాని మోదీ కోరారు.
'కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పాపాలను ప్రజలు చూశారు. కాంగ్రెస్ హయాంలో రూ.వేల కోట్ల కుంభకోణాలు వెలుగుచూశాయి. కాంగ్రెస్ హయాంలో బాంబు పేలుళ్లు వంటి ఘటనలు చూశాం. ఇండియా కూటమి ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులను తీసుకువస్తామని చెబుతోంది. ప్రతి పార్టీకి ఒక్కో ప్రధాని ఉంటే దేశం బాగుపడుతుందా? రైతుల రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ మోసగించింది. ఇప్పుడేమో ఆగస్టు 15 లోగా రైతు రుణాలు మాఫీ చేస్తామని చెబుతోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ చేతులెత్తేయాలని చూస్తోంది. అమరవీరులకు పింఛన్ల హామీని కాంగ్రెస్ నెరవేర్చిందా? మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్న హామీ నెరవేర్చిందా? విద్యుత్ కోతలతో ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. విశ్వాస ఘాతుకానికి పాల్పడిన కాంగ్రెస్ ప్రజలకు మేలు చేస్తుందానని' ప్రధాని మోదీ ప్రశ్నించారు.