తెలంగాణ

telangana

ETV Bharat / politics

రాష్ట్ర రాజకీయాల్లో 'హైడ్రా'మా - అక్రమ కట్టడాల కూల్చివేతపై మాటలయుద్దం - Hydra Political Heat in Telangana - HYDRA POLITICAL HEAT IN TELANGANA

Hydra Political Heat in Telangana : హైడ్రా అక్రమ కట్టడాల కూల్చివేత అంశంతో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. ఉస్మాన్‌సాగర్‌ ఎఫ్​టీఎల్​ పరిధిలోని అక్రమ కట్టడాల కూల్చివేతలు మంత్రులు, కాంగ్రెస్‌ నేతల నుంచే మొదలుపెట్టాలని బీఆర్ఎస్​ డిమాండ్‌ చేసింది. నిబంధనలకు అతిక్రమించి నిర్మించిన వాటన్నింటినీ హైడ్రా కూల్చుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. హైడ్రా పేరిట ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఎంపీలను టార్గెట్ చేయొద్దని బీజేపీ హితవు పలికింది.

Political Leaders Struggle Over Demolition of Illegal Buildings
Hydra Teams Demolish Illegal Constructions in Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 21, 2024, 7:50 PM IST

Updated : Aug 21, 2024, 8:11 PM IST

Hydra Fight Between Politicians :ఉస్మాన్‌సాగర్ ఎఫ్​టీఎల్​ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాల కూల్చివేతలు మంత్రులు, కాంగ్రెస్ నాయకుల నుంచే మొదలుపెట్టాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. తన పేరుతో ఎలాంటి ఫాంహౌస్‌ లేదని, తన మిత్రుడిది లీజుకు తీసుకున్నానని వెల్లడించారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో తనకంటూ ఫాంహౌస్‌ ఉంటే, దగ్గరుండి కూల్చివేయిస్తా అని స్పష్టం చేశారు.

మంచి జరుగుతున్నప్పుడు ఆహ్వానించాల్సిందే అన్న కేటీఆర్‌, రాష్ట్ర మంత్రులు, పెద్దపెద్ద కాంగ్రెస్‌నేతలు కట్టిన ఫాంహౌస్‌లు సైతం చూపిస్తామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి కూడా ఫాంహౌస్ ఉందన్నారు. మంత్రి పొంగులేటి, కేవీపీ, పట్నం మహేందర్‌రెడ్డి, సుఖేందర్‌రెడ్డికి ఎఫ్‌టీఎల్‌లో ఫాంహౌస్‌లు ఉన్నట్టు తెలిపారు. తప్పు తాను చేసినా కాంగ్రెస్‌ వాళ్లు చేసినా చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు. తన ఆస్తులపై ఎన్నికల అఫిడవిట్‌లో చూసుకోవచ్చని కేటీఆర్ వివరించారు.

నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటివారిదైనా కూల్చేస్తాం : చెరువులను చెరపట్టి నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుందని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే జన్వాడ ఫాంహౌస్ సహా ఎంతటివారిదైనా కూల్చేస్తామని తేల్చిచెప్పారు. సీఎం రేవంత్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని మంత్రులకు ఫాంహౌస్‌లు ఉన్నాయని కేటీఆర్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. మరోవైపు జన్వాడ ఫాంహౌస్ కేటీఆర్‌ సతీమణి కల్వకుంట్ల శైలీమా పేరుమీద రిజిస్ట్రేషన్ అయ్యిందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు.

"జీఓ నంబర్ 111 అతిక్రమించి జన్వాడలో అక్రమంగా ఇంద్రభవనంలాంటి ఫాంహౌస్ నిర్మించుకున్నారు. ఈ అంశంపై కేటీఆర్ మాటలు వింటే విడ్డూరంగా ఉన్నాయి. తనకెటువంటి ఫాంహౌస్ లేదని తన మిత్రుడు ఇంటిని వాడుతున్నట్లు చెప్పటం హాస్యాస్పదం. కాంగ్రెస్ నేతల ఇళ్లు ఉన్నాయంటూ చెప్పడం కాదు. ధరణి పేరిట వారు ఆక్రమించిన అన్ని ఆస్తులపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది."-కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర మంత్రి

పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో యథేచ్ఛగా విధ్వంసం చేసి సర్కార్‌ భూములను ఆక్రమించారని ద్వజమెత్తారు. సీఎం స్థాయి నుంచి కార్పొరేటర్ల వరకు అందరు ఆక్రమించుకున్నారని విమర్శించారు. ఉద్యమం ముసుగులో భూములపై కన్నేశారని ఆరోపించారు. కేటీఆర్‌కు అతని కుటుంబ సభ్యులకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వివరించారు. జన్వాడ ఫాంహౌస్ కూడా ఓ ప్రైవేట్ వ్యక్తిని భయపెట్టి లాక్కున్నారని విమర్శించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ గ్రీన్ ట్రిబ్యునల్ గురించి తెలియదా అని ప్రశ్నించారు. తప్పుచేస్తే చట్టానికి ఎవరు అతీతులు కాదని స్పష్టం చేశారు.

BJP MP Raghunandan On Hydra Issue : హైడ్రా పేరిట ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఎంపీలను టార్గెట్ చేయవద్దని బీజేపీ మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. రాజకీయ కక్ష కోసం హైడ్రాను వాడొద్దని, అధికార పార్టీ నుంచే కూల్చివేతలు మొదలవ్వాలన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఎవరు అక్రమంగా కట్టినా 24 గంటల్లో కూల్చివేయాలని హితవు పలికారు.

జన్వాడ ఫామ్‌హౌస్ ఘటనపై స్పందించిన ఎంపీ, ఇప్పటి సీఎం అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆ ఫామ్‌హౌస్​పై డ్రోన్‌ ఎగురవేశారని కేసులు పెట్టారని తెలిపారు. ఆ రోజే ఫామ్‌హౌస్‌ తనది కాదని కేటీఆర్ చెబితే అయిపోవు కదా అన్నారు. ఇప్పుడు ఇతరుల పేరుపై మార్చి నాది కాదు అంటే ఎలా అని ప్రశ్నించారు. మొత్తానికి హైడ్రా కూల్చివేతల అంశం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

60 గజాలైనా, 60 ఎకరాలైనా సరే నిబంధనల ప్రకారం కూల్చివేయాలి : హైకోర్టు - TG High Court On Hydra Demolition

ఆక్రమణలపై హైడ్రా హై నజర్​ - కబ్జా అని తేలితే కూల్చేయటమే! - HYDRA OPERATIONS

Last Updated : Aug 21, 2024, 8:11 PM IST

ABOUT THE AUTHOR

...view details