MP DK Aruna Condemns Attack On Allu Arjun House : సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడిని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఖండించారు. దాడి ఘటనలో 4 మంది కొడంగల్ వాసులున్నారని ఆమె ఆరోపించారు. జైలు నుంచి విడుదలైనటువంటి లగచర్ల రైతులను డీకే అరుణ పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటన నిందితుల్లో ఒకరు కాంగ్రెస్ జడ్పీటీసీగా పోటీ చేశారని ఆ పార్టీ నేతలే ఈ దాడి చేయించారనే అనుమానం కలుగుతోందని విమర్శించారు.
అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటన : ఓయూ జేఏసీ స్డూడెంట్స్ యూనియన్ ఆందోళనతో జూబ్లీహిల్స్‌లో అల్లు అర్జున్ ఇంటివద్ద ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మృతురాలు కుటుంబానికి అల్లు అర్జున్ వెంటనే రూ.కోటి పరిహారం చెల్లించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే నిరసనకారులు అల్లు అర్జున్ నివాసంపై రాళ్లను విసిరారు. నినాదాలు చేస్తూ ఆయన ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు. నిరసనకారులు విసిరిన రాళ్లు తగిలి అల్లు అర్జున్ ఇంటి ఆవరణలో పూల కుండీలు, గార్డెన్‌లోని మొక్కలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై సమాచారమందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. అర్జున్ నివాసం వద్ద అదనపు పోలీసు బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేశారు.
మరోవైపు ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీ, హైదరాబాద్ సీపీని ఆదేశిస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా: సీఎం రేవంత్‌రెడ్డి