CM Revanth about Telangana Debt : గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, వాళ్లు పదేళ్లలో చేసిన పాపానికి తాము శిక్ష అనుభవిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోందని, సంక్షేమ పథకాలకు సైతం నిధులు ఇవ్వలేని స్థితిని కల్పించారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. బొచ్చెడు తప్పులు.. పుట్టెడు అప్పులుగా బీఆర్ఎస్ పదేళ్ల పాలన సాగించిందని విమర్శించారు. ప్రపంచ బ్యాంకు 2 శాతం వడ్డీకి అప్పులు ఇస్తున్నా, 11.5 శాతం వడ్డీకి అప్పులు తెచ్చారని ధ్వజమెత్తారు. ఇలాంటి వారిని వేరే దేశంలోనైతే ఉరి తీసేవారని సీఎం రేవంత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
"7 డిసెంబరు 2023 నాటి ప్రభుత్వాన్ని వారు మాకు అప్పగించారు. అప్పుడు అప్పు కాంట్రాక్టర్లలకు చెల్లించాల్సిన బిల్లులు కావచ్చు, కార్పొరేషన్ల పేరు మీద తీసుకున్న లోన్లు కావచ్చు, ఎఫ్ఆర్బీఎం పరిధిలో తెచ్చిన అప్పులు కావచ్చు ఇవి అన్నీ లెక్కకడితే రూ.7.11 లక్షల కోట్లు. అదే మేము చేసిన అప్పు(హరీశ్‌రావు చెబుతున్నట్లు) రూ.1.27 లక్షల కోట్లు. ఈ రెండింటిని కూడితే రూ.8.39 లక్షల కోట్లు అవుతుంది. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అప్పు రూ.7,22,788 కోట్లు. మేము నిజంగా అప్పు చేస్తే అది రూ.8లక్షల కోట్ల పై చిలుకు ఉండాలి. వారు చేసిన అప్పులు కట్టడానికి మళ్లీ అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ అప్పుల వల్ల విద్యార్థులకు సరైన సమయానికి ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వలేకపోతున్నాము. తులం బంగారాన్ని ఇవ్వలేకపోతున్నాము. వారు చేసిన అప్పుల వల్ల ఇవన్నీ చేయలేకపోతున్నాం." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
రుణమాఫీపై సీఎం సమాధానం : దేశంలో ఎవ్వరూ చేయని విధంగా ఏడాదిలోనే రూ.20 వేల కోట్లకు పైగా రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం రెండు సార్లు రుణమాఫీ చేసినా కనీసం వడ్డీలకు కూడా ఆ నిధులు సరిపోలేదని సీఎం విమర్శించారు. రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. తొలి విడతలో రూ.లక్ష వరకు రుణమాఫీ చేశామని తెలిపారు. తొలి విడతలో జులై 18న రూ.6,034 కోట్ల రుణమాఫీ చేశామని స్పష్టంగా చెప్పారు. తొలి విడత చేసిన 12 రోజుల్లో రెండో విడత రుణమాఫీ చేశామన్నారు. రెండో విడతలో రూ.6,190 కోట్లు చేశామని, పంద్రాగస్టున మూడో విడతలో రూ.5 వేల కోట్లు రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. 27 రోజుల్లో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్‌దేనని.. రుణమాఫీపై శాసనసభలో చర్చ సందర్భంగా సీఎం సమాధానమిచ్చారు.
కల్యాణలక్ష్మి కీలక అప్డేట్ - 'తులం బంగారం' ఇచ్చేది ఎప్పటినుంచంటే?
రుణమాఫీ కానివారు ఆ పని చేయాలన్న సీఎం రేవంత్ - అదేంటో మీకు తెలుసా? - Cm Revanth on Runa Mafi