Minister Komatireddy On Benefit Shows : సినిమా బెనిఫిట్ షోలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో సంధ్య థియేటర్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన తరువాత మంత్రి కోమటి రెడ్డి కూడా మాట్లాడారు. సినిమా విడుదలకు ముందు రోజు ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవని వెల్లడించారు. ఇకపై టికెట్ల రేట్ల పెంపు్ అన్ని సినిమాలకు ఉండదని కూడా తెలిపారు. ఇన్నాళ్లు జరిగినట్లుగా ఇక ముందు సాగదని స్పష్టం చేశారు.
సంధ్య థియేటర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి పరిహారం ఇస్తామన్న అల్లు అర్జున్ మాట నిలబెట్టుకోలేదని అన్నారు. రేవతి కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని కోమటిరెడ్డి తెలిపారు. మరోవైపు సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. బాలుడి చికిత్సకు ప్రతీక్ ఫౌండేషన్ తరఫున సాయం చేస్తామని వివరించారు. ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల ఆర్ధిక సాయం చేస్తామన్నారు.
"సినిమా విడుదలకు ముందు ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవు. ఇకపై టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఇచ్చేది లేదు. సందేశాత్మక, దేశభక్తి చిత్రాలకు మాత్రమే ఉంటుంది. ఇక మీదట హీరోలు కూడా థియేటర్లకు వెళ్లొద్దు. రేవతి కుటుంబానికి పరిహారం ఇస్తామన్న అల్లు అర్జున్ హామీ నిలబెట్టుకోలేదు. రేవతి కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం. చనిపోయిన రేవతి కుటుంబానికి పరిహారం ఇస్తాం. ప్రతీక్ ఫౌండేషన్ నుంచి రేవతి కుటుంబానికి రూ.25 లక్షల ఇస్తాం. శ్రీతేజ్ వైద్య ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తుంది"- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంత్రి
మరోవైపు సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను మంత్రి కోమటిరెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య స్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ తండ్రిని కలిసి వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
'ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటానికి మేం ఒప్పుకోం - మేం అధికారంలో ఉన్నంతకాలం అలాంటి ఆటలు సాగవు'
అందువల్లే అల్లుఅర్జున్ శ్రీతేజ్‌ను పరామర్శించలేకపోయారు : అల్లు అరవింద్