Nara Lokesh May Join in New Cabinet in AP :తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లోకి చేరనున్నారు. ఆయనకు ప్రాధాన్యమున్న మంత్రిత్వ శాఖల బాధ్యతలు అప్పగించే అవకాశముంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడునిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల కథనం. సుదీర్ఘంగా యువగళం పాదయాత్ర చేసి ఎన్డీయే విజయంలో కీలక భూమిక పోషించిన నారా లోకేశ్ ఒక సందర్భంలో ఎన్నికల్లో గెలిచాక మంత్రివర్గంలో చేరడం కన్నా పార్టీ పరంగా బాధ్యతలు తీసుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే.
AP Cabinet Ministers List 2024 :ఇటీవల ఓట్ల లెక్కింపు ముగిశాక నారా లోకేశ్ విలేకరులతో మాట్లాడుతూ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన కేబినెట్‌లో చేరతారాలేదా అన్న దానిపై పార్టీ వర్గాల్లో గత రెండు రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ విషయంపై తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. బయట ఉంటే కీలక విధాన నిర్ణయాలు, వాటి అమల్లో భాగస్వామ్యం ఉండదన్న ఉద్దేశంతోనే లోకేశ్‌ను కేబినెట్‌లో తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.