BJP Leaders Complaint To Governor On Phone Tapping:రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను ఆయన నేతృత్వంలో బీజేపీ రాష్ట్ర నేతల ప్రతినిధి బృందం కలిసింది. టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఉల్లంఘన, దేశ ద్రోహానికి మించిన ఈ కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలని గవర్నర్‌ను కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
కేసీఆర్ ప్రమేయం లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేయలేదు : రఘునందన్ రావు
BJP MP Laxman On Phone Tapping Case :గవర్నర్‌కు వినతిపత్రం అందించిన అనంతరం మాట్లాడిన బీజేపీ నేత లక్ష్మణ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పడిన కేసీఆర్ సర్కారు అపవాదును తీసుకొచ్చిందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో పాత్రదారులను మాత్రమే అరెస్టు చేస్తున్న ప్రభుత్వం సూత్రధారులను కూడా అరెస్టు చేయాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాలు మేరకే నడుచుకున్నామని అధికారులు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. సొంత ప్రయోజనాలకోసం గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు(phone Tapping) పాల్పడటం హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు.
"నాయకులు, వ్యాపారులు, సినీ రంగంలోని ప్రముఖ వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లుగా వెలుగులోకి వస్తున్నాయి. రాజ్యంగ విరుద్ధమైన, దేశద్రోహానికి మించిన ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారంటే క్షమించరాని నేరం. దీనికి ఎవరు సూత్రధారులో తేల్చాల్సిన అవసరం ఉంది. వాస్తవాలు సీబీఐ విచారణ ద్వారానే బయటకు వస్తాయి. సీబీఐ ద్వారా ఎంక్వైరీకి ఆదేశం ఇవ్వాలని కోరుతూ గవర్నర్‌ను ఈరోజు కలవడం జరిగింది"- డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ ఎంపీ