MLC Kavitha Bail Petition in CBI Case :సీబీఐకేసులో అరెస్ట్ అయి, ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో కవిత తరఫున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేశారు. ఏడేళ్ల కన్నా శిక్ష తక్కువ పడే కేసుల్లో అరెస్టు చేయొద్దని నిబంధనలు ఉన్నాయని పిటిషన్‌లో కవిత పేర్కొన్నారు. గతంలో కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా అరెస్టు చేశారని తెలిపినట్టు ఆమె పేర్కొన్నారు.
కోర్టు ఆవరణలో మాట్లాడొద్దు : తనకు వెంటనే బెయిలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కవిత బెయిల్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు, ఈ నెల 20లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు ఇచ్చింది. దీనిపై ఈ నెల 22న విచారణ జరుపుతామని న్యాయమూర్తి తెలిపారు. మరోవైపు కోర్టు ప్రాంగణంలో మీడియాతో కవిత మాట్లాడటంపై ఆమె తరఫు న్యాయవాది మోహిత్ రావును న్యాయమూర్తి ప్రశ్నించారు. కోర్టు ఆవరణలో మాట్లాడవద్దని ఆమెకు సూచించాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. ఒకవేళ మాట్లాడాలనుకుంటే కోర్టు వెలుపల మాట్లాడాలని సూచించారు.
మరోసారి తిహాడ్ జైలుకు కవిత - ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ
9 రోజుల కస్టడీ : ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీ నుంచి సీబీఐ ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టు అనుమతితో శని, ఆదివారం 2 రోజులు ఆమెను అధికారులు ప్రశ్నించారు. కస్టడీ ముగియడంతో ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కవితకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించాలని సీబీఐ అధికారులు కోర్టును కోరగా, 9 రోజుల కస్టడీకి రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది. దీంతో ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కవితను అధికారులు మరోసారి తిహాడ్ జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
లిక్కర్ స్కామ్‌తో నాకు సంబంధం లేదు - నాకెలాంటి ఆర్థిక లబ్ధి చేకూరలేదు : కవిత
రెండేళ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారు : అయితే కోర్టుకు వెళ్లే ముందు కవిత మీడియా (Kavitha on CBI Investigation)తో మాట్లాడుతూ బీజేపీ తీవ్రంగా మండిపడ్డారు. ఇది సీబీఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అని అన్నారు. బయట కమలం పార్టీ వాళ్లు మాట్లాడేదే, లోపల అధికారులు అడుగుతున్నారని తెలిపారు. రెండేళ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు.
జపమాల, నరసింహ శతకం, గజేంద్ర మోక్షం - వీటిని ఇచ్చేందుకు కవితకు కోర్టు అనుమతి