KTR Speech in Chevella BRS Workers Meeting : కారు సర్వీసింగ్‌కు పోయిందని, మళ్లీ వంద స్పీడుతో దూసుకొస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. కార్యకర్తలెవరూ అధైర్య పడొద్దని సూచించారు. 119 సీట్లలో 39 సీట్లు సాధించి బలమైన ప్రతిపక్షంగా ఉన్నామని, ప్రజల తరఫున పోరాడతామని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, గత పదేళ్లలో తమ మధ్య సమన్వయం లోపించింది వాస్తవమని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. ఇప్పుడు అలా జరగకుండా చూస్తామని చెప్పారు.
KTR Fires on Congress : ఈ క్రమంలోనే 14 సీట్లు ఐదు వేల ఓట్లతో ఓటమి పాలయ్యామని, అందులో సగం గెలిచినా హంగ్ వచ్చేదని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదన్న కేసీఆర్ మాటలను రేవంత్ సర్కార్ నిజం చేస్తోందని విమర్శించారు. మార్పు కావాలి అన్నోళ్లు, ఇప్పుడు నెత్తీనోరు కొట్టుకుంటున్నారని తెలిపారు. ఇప్పటి వరకు రైతు బంధు పైసలు పడలేదన్న ఆయన, కేసీఆర్ ప్రభుత్వంలో వారం రోజుల్లో డబ్బులు రైతుల ఖాతాల్లో జమయ్యేవన్నారు. ఈ క్రమంలోనే రైతుబంధు పడలేదన్న వారిని మంత్రి కోమటిరెడ్డి చెప్పుతో కొట్టమన్నారని గుర్తు చేసిన కేటీఆర్, చెప్పుతో కొడతామన్న కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో వేటెయ్యాలన్నారు.
హామీలు తప్పించుకునేందుకే రోజుకో అవినీతి కథ - అధికారం చేతుల్లోనే ఉందిగా వెలికితీయండి : కేటీఆర్
రేవంత్ రెడ్డి చెప్పిన రూ.2 లక్షల రుణమాఫీ, కల్యాణమస్తు రూ.లక్ష, తులం బంగారం ఎక్కడని కేటీఆర్ ప్రశ్నించారు. ఇచ్చిన 420 హామీలను నెరవేర్చలేక కేసీఆర్ అప్పుల పాలు చేశాడంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హామీ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదని, 420 హామీలని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీని బట్టలిప్పి చేవెళ్ల చౌరస్తాలో నిలబెడతామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే లంకెబిందెలున్నాయని వస్తే, ఖాళీ బిందెలున్నాయంటూ సీఎం రేవంత్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్న ఆయన, కనీసం మంత్రిగా పని చేయనోడిని ముఖ్యమంత్రిని చేస్తే ఇట్లే ఉంటుందని దుయ్యబట్టారు.