KTR Reacted to Sunkishala Project Issue : సుంకిశాల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్‌కు 50 ఏళ్లు తాగునీటి అవసరాలకు సరిపడేలా ప్రణాళికలు చేశామన్న ఆయన, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు.
సుంకిశాల ప్రాజెక్టు డ్యామేజ్‌పై శాసనసభలో ఎందుకు ప్రకటన చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం, పర్యవేక్షణ లోపం వల్ల హైదరాబాద్ ప్రజలకు తీరని నష్టం వాటిల్లిందని కేటీఆర్ వాపోయారు. సుంకిశాలకు పునరుజ్జీవనం తెచ్చిందే బీఆర్‌ఎస్ ప్రభుత్వమన్న ఆయన, నాగార్జునసాగర్‌లో డెడ్‌స్టోరేజ్ ఉన్నా హైదరాబాద్‌కు నీటి కష్టాలు రావని స్పష్టం చేశారు.
"హైదరాబాద్‌లో పెరుగుతున్న తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వ హయాంలో సుంకిశాల ప్రాజెక్ట్‌కు పునరుజ్జీవం చేశాం. మరుగునపడ్డ ప్రాజెక్ట్‌ను మళ్లీ తెరముందుకు తీసుకురావడం జరిగింది. ఏఎమ్ఆర్పీ ద్వారా నీటిని ఎత్తిపోయాలంటే నాగార్జున సాగర్‌లో 510 అడుగులపైన నీరు ఉంటేనే లిఫ్టింగ్‌కు సాధ్యం. కానీ మేము తీసుకున్న సుంకిశాల ప్రాజెక్ట్ నిర్ణయంతో సాగర్‌లో డెడ్‌స్టోరేజ్‌లో నీళ్లు ఉన్నా లిఫ్ట్చేయవచ్చు."-కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుంకిశాలను పట్టించుకోలేదు : కృష్ణా నదికి మూడు, నాలుగు ఏళ్లు వరద రాకపోయినా హైదరాబాద్‌కు నీరు తీసుకొచ్చేలా ఈ ప్రాజెక్టు చేపట్టామని మాజీ మంత్రి తెలిపారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ రింగ్ మెయిన్ ఏర్పాటు చేయాలన్నది కేసీఆర్ నిర్ణయమని, అందులో 42 కిలోమీటర్లు పూర్తి చేశామని వివరించారు. సీతారామ ప్రాజెక్టును వాయువేగంతో పూర్తి చేసింది తమ ప్రభుత్వమని, కానీ ఇవాళ కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.