Telangana SSC Exams Fee Dates : మార్చి నెలలో జరగనున్న పదో తరగతి పరీక్షల కోసం రుసుము చెల్లింపు తేదీలను ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఓ ప్రకటనను విడుదల చేశారు. 'ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 18వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. రూ. 50 ఆలస్య రుసుముతో డిసెంబర్ రెండో తేదీ వరకు, రూ. 200 రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 12వ తేదీ వరకు గడువు, రూ. 500 ఆలస్య రుసుముతో చెల్లింపునకు డిసెంబర్ 21వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఫీజు చెల్లించే గడువు ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించే ప్రసక్తి లేదు' అని సంచాలకులు స్పష్టం చేశారు.
రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125 పరీక్ష రుసుము కింద చెల్లించాల్సి ఉంటుంది. మూడు, అంతకంటె తక్కువ సబ్జెక్టులకు రూ. 110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు ఉంటే రూ. 124 చెల్లించాల్సి ఉంటుంది. ఒకేషనల్ విద్యార్థులు రూ. 125లతో పాటు మరో రూ. 60 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.