A Man Secured 8 Govt jobs : నేటి యువత ఒక ప్రభుత్వ కొలువును సాధించడానికి ఏళ్ల తరబడి కోచింగ్‌లు తీసుకుంటూ నానా తంటాలు పడుతున్నా ఉద్యోగం రాని పరిస్థితులు ఎక్కువుగా చూస్తున్నాం. పుస్తకాలతో కుస్తీపడుతూ గదుల్లో మగ్గిపోతూ ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా యువత పోరాడుతున్నారు. కానీ మెదక్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏటువంటి కోచింగ్ లేకుండా తమ కుటుంబ కష్టాలను గుర్తి చేసుకుంటూ ఏకంగా 8 ప్రభుత్వ కొలువులు సాధించాడు. మరి అన్ని ఉద్యోగాలు ఎలా సాధించాడో ఇప్పుడు తెలుసుకుందాం.
8 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సత్తాచాటి : మెదక్ జిల్లా హవేలిఘనపూర్ మండలం ఫరీద్‌పూర్ తండాకు చెందిన చత్రియ, కమిలి దంపతుల కుమారుడు శ్రీనివాస్. వీరిది పేద కుటుంబం. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నాడు. తరువాత మెదక్‌లో ఇంటర్, డిగ్రీ, సికింద్రాబాద్‌లో పీజీ పూర్తి చేశాడు. 2007 నుంచి ఇంట్లోనే ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. భార్య సరిత అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తూ భర్తకు చదువులో తోడునీడగా నిలిచింది. 2012లో ఆర్టీసీలో జూనియర్ అకౌంటింగ్ ఉద్యోగం సాధించి రెండేళ్ల పాటు చేశారు.
అంతటితో ఆగని శ్రీనివాస్ మళ్లీ తమ కసరత్తును మెుదలు పెట్టి డీసీబీలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం సాధించాడు. తర్వాత 2014లో పంచాయతీ కార్యదర్శిగా కొలువు సాధించాడు. 2015లో హైదరాబాద్ మెట్రో నీటి సరఫరా విభాగంలో జూనియర్ అకౌంటెంట్, 2016 లో ఫుడ్ కార్పొ రేషన్ ఆఫ్ ఇండియాలో సీనియర్ అకౌంటెంట్, అదే సంవతర్సంలో బీఎస్ఎన్ఎల్లో జూనియర్ అకౌంట్స్ అధికారిగా 2023లో గురుకుల అధ్యాపకుడిగా కొలువులు సాధించాడు.
పేదరికమే ఇన్ని ఉద్యోగాలు సాధించేలా చేసింది : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 ప్రభుత్వ కొలువులు సాధించి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు శ్రీనివాస్. కానీ శ్రీనివాస్ ఆయా ఉద్యోగాల్లో చేరలేదు. కార్యదర్శిగా పదేళ్ల పాటు పనిచేశారు. ప్రస్తుతం తుప్రాన్‌లో మున్సిపల్ అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగం చేస్తూనే సాయంత్రం, ఉదయం పూట, సెలవు రోజుల్లో ఇంట్లోనే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఇన్ని ఉద్యోగాలు రావడానికి ప్రధాన కారణం తమ పేదరికమే తమలో కసిని పెంచిందని శ్రీనివాస్ చెబుతున్నారు.
గ్రూప్స్‌లో కొలువు సాధించడమే లక్ష్యం : ఇంతటితో సంతృప్తి చెందని శ్రీనివాస్ మళ్లీ తమ ప్రయత్నానికి పదునుపెట్టి గ్రూప్స్‌లో కొలువు సాధించాలని పట్టుదలతో శ్రమిస్తున్నారు. తనతో పాటు తమ పిల్లలను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా చేసే లక్ష్యంతో ఉన్నట్లు శ్రీనివాస్ చెబుతున్నారు. కోచింగ్ సెంటర్లు మాత్రమే ప్రభుత్వ కొలువులకు మార్గం చూపుతాయంటే వంద శాతం నిజం లేదని శ్రీనివాస్ స్పష్టం చేస్తున్నారు. యువత పెడదారి పట్టకుండా మార్గాన్ని లక్ష్యం వైపు గురిపెడితే విజయం తప్పక వరిస్తోందని చెబుతున్నారు.
గ్రంథాలయాన్నే నివాసంగా మార్చుకున్న యువకుడు - వరుస కట్టిన 5 ప్రభుత్వ ఉద్యోగాలు