Holiday for Sri Chaitanya School : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో అక్కడి అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలకు యాజమాన్యం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సెలవు ప్రకటించింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని శనివారం (ఫిబ్రవరి 01) సెలవు ఇస్తున్నట్లు హెడ్ మాస్టర్ సంజీవ్ తెలిపారు.
పెద్దపులి కోసం అన్వేషణ : గత మూడు రోజుల నుంచి బెల్లంపల్లి, కాసిపేట అటవీ ప్రాంతాల్లో వన్యమృగం సంచరిస్తుందని అటవీ అధికారులు స్పష్టం చేశారు. దానిలో భాగంగా పెద్దపులి జాడ కోసం అటవీ అధికారులు అన్వేషణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. పెద్దపులి పట్టణం సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో తిరుగుతుందని తెలియడంతో అక్కడి ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
రైతులు వ్యవసాయ క్షేత్రాలకు ఒంటరిగా వెళ్లొద్దని అటవీ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే గుంపులుగా కలిసి వెళ్లాలని సూచించారు. పశువులను వ్యవసాయ క్షేత్రాల్లో ఉంచొద్దని తెలిపారు.
"బెల్లంపల్లి పెద్దమ్మ తల్లి గుడి దగ్గర పెద్దపులి పాదముద్రలను గుర్తించినట్లు అటవీ శాఖ అధికారులు చెప్పారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యల కింద ఈరోజు (ఫిబ్రవరి 01) సెలవు ప్రకటించడం జరిగింది" -సంజీవ్, హెడ్ మాస్టర్, శ్రీ చైతన్య స్కూల్ బెల్లంపల్లి
మల్కాపూర్ గుట్టల్లో పెద్దపులి సంచారం - అక్కడి ప్రజల్లో కలవరం
అమ్మ బాబోయ్ పెద్దపులి - కంటిమీద కునుకులేకుండా గడుపుతున్న నల్లబెల్లి వాసులు