KTR Participate in Karimnagar BRS Meeting :అబద్ధాలు చెప్పడమే సీఎం రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) ధ్వజమెత్తారు. గుజరాత్ మోడల్‌గా రాష్ట్రాన్ని తయారు చేస్తామని సీఎం అంటున్నారని అన్నారు. గుజరాత్ మోడల్ అంటే హిందువులు, ముస్లింలు తన్నుకోవడమా అని ప్రశ్నించారు. కరీంనగర్‌లో నిర్వహించిన కరీంనగర్ కదనభేరి సన్నాహక సమావేశం, పార్లమెంటరీ స్థాయి సమీక్ష సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం కదనభేరి గోడపత్రికను ఆవిష్కరించారు.
రాహుల్‌గాంధీ(Rahul Gandhi) ఏమో గుజరాత్ మోడల్ అట్టర్ ప్లాప్ అంటారు, మరి సీఎం రేవంత్ ఏమో గొప్పదని అంటారని కేటీఆర్ విమర్శించారు. 90 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రజాభిమానాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాలం తెచ్చిన కరవు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరవే ఉందని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఎద్దేవా చేశారు.
Karimnagar Kadanabheri Sabha : కరీంనగర్ అంటే కేసీఆర్‌కు సెంటిమెంట్, ఇక్కడి నుంచే ఎన్నో పోరాటాలకు శ్రీకారం చుట్టారని కేటీఆర్ అన్నారు. ఆనాడు ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా ఇక్కడి నుంచే జంగ్ సైరన్ మోగించారని గుర్తు చేశారు. ఇప్పుడు అబద్ధాల రేవంత్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం మహబూబ్‌నగర్‌లో సీఎం భాష తనకైతే అర్థం కాలేదని కేటీఆర్ అన్నారు. గొంతు కోస్తాను, మానవ బాంబు అయి పేలతానని అంటున్నారని దుయ్యబట్టారు.
"మేమైతే కోరుకుంటున్నాము అయిదేళ్లు కొనసాగాలి. ఇచ్చిన 420 హామీలు నెరవేర్చాలి. రేవంత్ రెడ్డిని ఎవరో కాదు పక్కన ఉన్న ఖమ్మం, నల్గొండ బాంబులు పేల్చకుండా జాగ్రత్త పడు. బుధవారం గమ్మత్తుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కరవు పరిస్థితిని అందరం కలిసి ఎదుర్కొందామని. మేడిగడ్డ మరమ్మత్తు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ కరవు వచ్చిందని రైతులకు వివరించాలి." - కేటీఆర్, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు