Congress Promises In Delhi Assembly Elections 2025 : దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలకు సంబంధించి పోస్టర్లను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. దిల్లీలో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో ఇచ్చిన హామీలను తాము నెరవేర్చుతున్నట్లు తెలిపారు. రైతులకు రుణమాఫీ చేసినట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వండి : తెలంగాణలో తమ ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోందని, తాము ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. రైతన్నలకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, విజయవంతంగా ఎన్నికల హామీలు అమలు చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో 55 వేల ఉద్యోగాలు కల్పించామని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోందని, ఇప్పటి వరకు 120 కోట్ల జీరో టికెట్లతో మహిళలు ప్రయాణం చేశారనిపేర్కొన్నారు. దిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.
Congress Scheme For Unemployed Delhi Youths : దిల్లీలో తాము అధికారంలోకి వస్తే విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ఏడాది పాటు నెలకు రూ.8,500 ఇస్తామని ప్రకటించింది. యువ ఉడాన్ యోజన కింద నిరుద్యోగులకు ఈ ఆర్థిక సాయం చేయడమే కాకుండాగ, వారి నైపుణ్యాలకు అనుగుణంగా కంపెనీళ్లో పనిచేసేలా చేస్తామని చెప్పింది. అయితే ఇది ఇంట్లో కూర్చినే వారికి కాదని, వారి నైపుణ్యాలు ప్రదర్శించినవారికి డబ్బులు ఇస్తామని తెలిపింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ ఆదివారం ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా నిరుద్యోగులు వారి శిక్షణ పొందిన రంగంలో పనిలో చేరేలా ప్రయత్నిస్తామన్నారు. తద్వారా వారు వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకోగలరని సచిన్ పైలట్ అన్నారు.
ఇప్పటికే పలు జానాకర్షణ పథకాలను కాంగ్రెస్ ప్రకటించింది. ప్యారీ దీదీ యోజన కింద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందిస్తామని జనవరి 8న హామీ ఇచ్చింది. 'జీవన్ రక్షా యోజన' కింద రూ.25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమాను అందిస్తామని హామీ ఇచ్చింది. ఇదిలా ఉండగా, 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న దిల్లీలో పోలింగ్ ఫిబ్రవరి 5న జరుగుతుంది. ఫిబ్రవరి 8న ఓట్లు లెక్కింపు ఉంటుంది.
'ప్రధాని మోదీ అడుగుజాడల్లో కేజ్రీవాల్- తప్పుడు వాగ్దానాల్లో దొందూ దొందే!'
నిరుద్యోగులకు నెలకు రూ.8,500 ఆర్థిక సాయం- కాంగ్రెస్ కీలక ప్రకటన!