KTR Comments On CM Revanth Reddy :రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. షరతులు లేకుండా రూ.2లక్షల వరకు రుణమాఫీ జరిగేదాక ప్రభుత్వాన్ని వదిలిపెట్టమన్నారు. ఓట్లు ఎవరికి వేశామో వారినే రుణమాఫీ గురించి అడుగుదామని, రైతులు అధికారుల వెంబడి కాకుండా కాంగ్రెస్ నేతల వెంటపడాలని సూచించారు.
ఎక్కడికక్కడ దేవుళ్లపై ఒట్లు వేసి చెప్పారు :లోక్‌సభ ఎన్నికల సభల్లో ప్రచారానికి ఎక్కడికెళ్తే అక్కడున్న దేవుళ్లపై రేవంత్ రెడ్డి ఒట్లు వేశారని కేటీఆర్ మండిపడ్డారు. 'పంద్రాగస్టున రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్లేసి సీఎం చెప్పారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వేములవాడ రాజరాజేశ్వరస్వామిపై, మహబూబ్‌నగర్ కురుమూర్తి, భద్రాద్రి సీతారాములస్వామిపై ఒట్లు వేశారు' అని కేటీఆర్ విమర్శించారు. రుణమాఫీకి రూ.49 వేల కోట్లు కావాలని సీఎం రేవంత్ చెప్పారన్న కేటీఆర్ మంత్రివర్గం భేటీలో రుణమాఫీకి రూ.31 వేల కోట్లు కావాలన్నారు. అసెంబ్లీ బడ్జెట్‌లో రుణమాఫీకి రూ.26 వేల కోట్లు మాత్రమే కేటాయించారని దుయ్యబట్టారు.
"డిసెంబర్ 9న తొలి సంతకం రుణమాఫీపై అని సీఎం హామీ ఇచ్చారు. రుణాలు తెచ్చుకోని వాళ్లు వెంటనే తెచ్చుకోవాలని చెప్పారు. రేవంత్ రెడ్డి సీఎం కాగానే రుణమాఫీ కోసం బ్యాంకర్లతో సమావేశమయ్యారు. రైతు రుణమాఫీకి ఎంత అవుతుందని బ్యాంకర్లను అడిగారు. రూ.2 లక్షల చొప్పున రుణమాఫీకి రూ.49 వేల కోట్లు అవుతాయని బ్యాంకర్లు చెప్పారు " - కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
KTR On CM Revanth Reddy :'కేసీఆర్కు అధికారం పోయాక చేవెళ్లకు కలపోయిందని, బతుకులు ఆగమాగం అయ్యాయని ప్రజలంటున్నారు. కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి నష్టపోయామని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు చెబుతున్నారు. రుణమాఫీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బయటపడాలని చావు తెలివితేటలు మొదలు పెట్టారు. మనుషులనే కాదు, దేవుళ్లను కూడా ఆయన మోసం చేశారు. ఇప్పుడు దేవుళ్లు ఆయన కోసం వెతుకుతున్నారు' అని కేటీఆర్ విమర్శించారు.