KTR CHIT CHAT 2024 : లోక్‌సభ ఎన్నికల కసరత్తులో భాగంగా భారత రాష్ట్ర సమితి శనివారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ సమావేశాలు నిర్వహించనుంది. రోజుకు పది నియోజకవర్గాల చొప్పున ఫిబ్రవరి పదో తేదీలోపు సమావేశాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి సమావేశానికి రాష్ట్ర పార్టీ నుంచి ఇద్దరు సీనియర్ నేతలు హాజరు కానున్నారు. ఈ నెల 27న మొదటి రోజు సిద్దిపేట, జూబ్లీహిల్స్, వనపర్తి, బోథ్, నల్గొండలో సమావేశాలు జరగనున్నాయి. పార్టీ నాయకులు, సానుభూతిపరులు, కార్యకర్తలు ప్రతి బూత్‌లో ఒక సోషల్ మీడియా వారియర్ ఉండేలా తెలంగాణ బలగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మీడియా ఇష్టాగోష్ఠిలో తెలిపారు.
BRS Meetings by Assembly Constituencies : క్షేత్రస్థాయి నుంచి పార్టీ కమిటీలను బలోపేతం చేయడంతో పాటు జిల్లాలోని పార్టీ కార్యాలయాలతో తెలంగాణ భవన్‌కు అనుసంధాన వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ చెప్పారు. కార్యక్రమాల అమలు కమిటీ ఏర్పాటు, పర్యవేక్షణ, లైబ్రరీ, రీసెర్చ్ వింగ్ ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ వివరించారు. లోక్‌సభ సన్నాహక సమావేశాల్లో చాలా అభిప్రాయాలు, సూచనలు వచ్చాయన్న ఆయన, అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశాల తర్వాత సీనియర్ల సమావేశంలో అన్ని విషయాలపై సమగ్రంగా చర్చిస్తామని చెప్పారు. పురపాలికల్లో అవిశ్వాసాలు వచ్చిన చోట పార్టీ తరఫున విప్ ఇస్తున్నామని, ధిక్కరించిన వాళ్ల సభ్యత్వాలు పోయేలా పోరాడతామని తెలిపారు.
మరో ఏక్నాథ్ షిండేగా రేవంత్ మారినా ఆశ్చర్యం లేదు : కేటీఆర్
KTR Fires on Congress : లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి ఆశావహులు చాలా మంది ఉన్నారని, సిట్టింగులతో పాటు సీనియర్లు చాలా మంది ఆసక్తితో ఉన్నారని కేటీఆర్ వివరించారు. గత లోక్‌సభ ఎన్నికల తరహాలోనే సానుభూతి పని చేస్తుందని ఇటీవల ఓడిపోయిన కొందరు ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వంపై ఇంత వేగంగా అసంతృప్తి రావడం ఇది మొదటిసారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కొత్తగా వచ్చిన వాళ్లకు సమయం ఇవ్వాలని, అయితే వారికి సహనం కూడా ఉండాలని అన్నారు. రైతు బంధు ఇవ్వలేదు అంటే చెప్పుతో కొడతా అంటే రైతులు హర్ట్ అవ్వరా? అని ప్రశ్నించారు. రెండెకరాల వరకు అందరికీ రైతుబంధు పడలేదని, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, అందరికీ ఇస్తారేమోనని అన్నారు.
ఆటో డ్రైవర్ల సమస్యలపై పార్టీ కమిటీ నివేదిక ఇచ్చిందని, ఆత్మహత్య చేసుకున్న 9 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలను పార్టీ తరఫున ఆదుకుంటామని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా కేంద్రానికి దాఖలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆక్షేపించిన కేటీఆర్, కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత విషయమై అసెంబ్లీలో, అఖిలపక్షంలో చర్చించవచ్చు కదా అని ప్రశ్నించారు. సీఎం, మంత్రులు హామీలు పక్కన పెట్టి, ఏదో జరుగుతున్నట్లు హడావిడి చేస్తున్నారని, వారిచ్చిన 420 హామీలు నిలబెట్టుకునే దిశగా ప్రజల తరఫున గొంతు విప్పుతామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదాకా విడిచి పెట్టం : కేటీఆర్
అప్పులెందుకన్నారు, మరి ఆ నిర్మాణాల సంగతేంటి : కొత్త సచివాలయం, అసెంబ్లీ అంటే అవసరమా అన్న వారు, కొత్త హైకోర్టు గురించి ఏమంటారని, అప్పుల పాలు అంటారు, కొత్త సీఎం క్యాంపు కార్యాలయం ఎందుకు అని ప్రశ్నించారు. రైతుబంధుకు డబ్బులు లేవు అంటారు, కొత్త క్యాంపు కార్యాలయం, దిల్లీలో కొత్త తెలంగాణ భవన్ అవసరమా? అని నిలదీశారు. సీఎం 45 రోజుల్లో చాలాసార్లు దిల్లీ వెళ్లారన్న కేటీఆర్, పాలన దిల్లీ నుంచి నడుస్తుందని తాము చెప్పినట్లే జరుగుతోందని వ్యాఖ్యానించారు. దావోస్ పర్యటన వృథా అని గతంలో తనను విమర్శించిన వారు ఇప్పుడు ఏమంటారని ప్రశ్నించారు. బహుళజాతి సంస్థలతో సామాజిక న్యాయం ఉండదని, ప్రయోజనం లేదని ఉప ముఖ్యమమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారన్న కేటీఆర్, ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే దావోస్ ఎందుకు వెళ్లారని సీఎంను భట్టి ప్రశ్నించినట్లు ఉందని వ్యాఖ్యానించారు.