KTR Argument with ED Officials as Sister Kavitha Arrest : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును న్యాయపరంగా ఎదుర్కొంటామని, కార్యకర్తలు శాంతియుతంగా ఉండాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. అంతకు ముందు కవిత అరెస్టుపై ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. ఈడీకి సహకరిస్తామని కవిత కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్ నేతలు చెప్పారు.
ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఈడీ అధికారులను బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ప్రశ్నించారు. అరెస్టు చేయబోమని కోర్టులో చెప్పి ఎలా అరెస్టు చేస్తారంటూ మండిపడ్డారు. సుప్రీంకోర్టులో ఇచ్చిన మాటను ఈడీ ఎలా తప్పుతుందని అన్నారు. కోర్టు ద్వారా ఈడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. కావాలనే శుక్రవారం వచ్చారని కేటీఆర్ ధ్వజమెత్తారు. సోదాల తర్వాత కూడా ఇంట్లోకి రావద్దన్న అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌తో పాటు హరీశ్ రావు కూడా ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కాసేపు అక్కడ ఈడీ అధికారులకు, కేటీఆర్‌కు మధ్య తీవ్రంగానే వాదోపవాదాలు జరిగాయి.
ముందే టికెట్ బుక్ చేసి సోదాలు :లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను భయపెట్టేందుకే కవిత అరెస్ట్ అని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. పిట్ట బెదిరింపులకు భయపడేది లేదన్నారు. కవితను రాత్రి 8.45 గంటలకు విమానంలో దిల్లీకి తీసుకెళ్తామన్నారని, ప్రణాళిక ప్రకారమే ఆమెను అరెస్టు చేశారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని, కవిత కోసం విమానం టికెట్ బుక్ చేసి మరీ సోదాలకు వచ్చారని ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలోనే మహిళల అరెస్టు అంశంపై సుప్రీంలో కేసు నడుస్తోందని, సుప్రీం సూచనలనూ పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు. ఈ నెల 19న సుప్రీంలో విచారణ ఉండగానే అరెస్టు సరికాదన్నారు.