Chennur MLA Vivek Speech in Malala Simhagarjana Sabha : మాలలందరూ ఐక్యంగా ఉంటే హక్కులు సాధించుకోవడం సులభమని.. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించిన మాలల సింహగర్జన సభకు ఆ సామాజిక వర్గానికి చెందిన పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. మాలల ఐక్యత చాటేలా నేతలంతా ఒకే వేదికపైకి వచ్చి గళంవిప్పారు. రాష్ట్ర నలుమూలల నుంచి మాలలు భారీగా తరలివచ్చారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మందకృష్ణ మాదిగ, ప్రధాని మోదీపై మాల నాయకులు తీవ్రంగా విమర్శించారు.
చాలా ఏళ్లుగా మందకృష్ణకు ఎస్సీలందరూ ఎలాంటి బేధాలు లేకుండా సహకరిస్తే, ఇప్పుడు వెళ్లి మోదీ పంచన చేరాడని మండిపడ్డారు. అంబేడ్కర్‌ను ఎవరూ విమర్శించిన, మాలలు ఊరుకునేది లేదని ఎమ్మెల్యే వివేక్ స్పష్టం చేశారు. అనంతరం వారి డిమాండ్లను వినిపించారు. రిజర్వేషన్ల వర్గీకరణ కాదు, జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కాకా కళాశాలల్లో ఎక్కడా ఎస్సీ, ఎస్టీ తేడా చూపలేదన్నారు. మందకృష్ణ మాదిగ ఉద్యమాన్ని తాకట్టు పెట్టారని, అలాంటి వారికి మాలల శక్తి చూపించాల్సిన సమయం వచ్చిందన్నారు. కలిసికట్టుగా పోరాడితేనే ఫలాలు అందుతాయన్నారు. ఈడీ దాడులు చేసినా వెనక్కి తగ్గని తనకు, మంత్రి పదవిపై వ్యామోహం లేదన్నారు.
రిజర్వేషన్ కోసం మతమార్పిడిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు- 'అలా చేయడం రాజ్యాంగాన్ని మోసగించడమే'