Kishan Reddy on the Phone Tapping Case in Telangana :ఫోన్ ట్యాపింగ్ కేసు అంత ఆషామాషీ కాదని, మాజీ సీఎం కేసీఆర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నైతిక విలువలు లేకుండా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించిందని, ఒక పార్టీలో గెలిచి అధికార పార్టీలో సిగ్గు లేకుండా మంత్రి పదవులు అనుభవించారని ధ్వజమెత్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను(Party Defections in Telangana) ఎజెండాగా పెట్టుకుందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి వేరే ఎజెండా లేదని, పార్టీ ఫిరాయింపులే ఎజెండాగా ఉందన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీని వీడిన వారినీ కుక్కలు, నక్కలతో పోల్చారు, మరి ఆ కుక్కలను, నక్కలను ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఎట్లా చేశారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామాతో పాటు ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేయాలన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారడం సమంజసం కాదని హితవు పలికారు.
Kishan Reddy Fires on KCR :అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసీఆర్ కుటుంబం బరి తెగించి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిందని కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) వ్యవహారంలో సీనియర్ పోలీసు అధికారులు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని వివరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అంత ఆషామాషీ కాదని చాలా తీవ్రమైందన్నారు. రాజకీయ లబ్ధి కోసం చేసిన ట్యాపింగే కాదు వ్యక్తిగత గోప్యత, గౌరవం, నియమాల ఉల్లంఘన జరిగిందని ఆవేదన చెందారు.
2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లో పూర్తిగా బీఆర్ఎస్ సర్కారు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. 2020 అక్టోబరులో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. పోలీసు నివేదికలో సైతం ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు బయటకు వస్తున్నాయన్నారు.
హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేసి మూసీ నదిలో పడేసి - ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్!