BRS Public Meeting in Chevella : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్పార్టీ తమ కార్యక్రమాల్లో స్పీడు పెంచింది. ఆ పార్టీ ముఖ్యనాయకులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ పలు సూచనలు చేస్తూ వస్తోంది. మరోసారి ఆ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎప్రిల్ 13న చేవెళ్లలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్(KCR) పాల్గొంటారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారిని కోరారు.
అధికారం, ఆస్తుల కోసమే రంజిత్ రెడ్డి పార్టీ మారారు : కేటీఆర్
అధికారం, ఆస్తుల కోసమే ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ను(BRS) విడిచి ద్రోహం చేశారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ఆరోపించారు. చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో తెలంగాణ భవన్లో(Telangana Bhavan) సమావేశమైన ఆయన ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరిన రంజిత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రంజిత్ రెడ్డి ఎవరో మన పార్టీ సీటు ఇచ్చి, గెలిపించుకున్న తర్వాతనే ప్రపంచానికి తెలిసిందన్న ఆయన 2019లో రాజకీయాలకు కొత్త అయినా పార్టీలో ఉన్న, ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి గెలిపించారని గుర్తు చేశారు.
KTR FIRES ON RANJITH REDDY :రాజకీయంగా పార్టీలో అత్యధిక ప్రాధాన్యత, నియోజకవర్గంలో స్వేచ్ఛ ఇచ్చినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయబోను, రాజకీయాల నుంచి తప్పుకుంటానని అశక్తత వ్యక్తం చేసి రంజిత్ రెడ్డి పార్టీకి ద్రోహం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ శ్రేణులే కాదు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ రంజిత్ రెడ్డికి (Ranjith Reddy) పార్టీ ఏం తక్కువ చేసిందని, పార్టీకి మోసం చేసి వెళ్ళారని చర్చించుకుంటున్నారని అన్నారు.
ఎప్రిల్ 13న చేవెళ్లలో కేసీఆర్ బహిరంగ సభ
సొంతంగా అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గెలవడం అసాధ్యమని తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలో 13వ తేదీన కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. రంజిత్ రెడ్డి పార్టీ వీడినందుకు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న కేటీఆర్, పార్టీ అవకాశం ఇచ్చినందుకే ఆయన సేవ చేశారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. అందరూ కలసికట్టుగా కృషి చేసి చేవెళ్లలో హ్యాట్రిక్ విజయం సాధించాలని పిలుపునిచ్చారు.