Heated Discussion In Telangana Assembly : రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. సభ కార్యకలాపాలపై సభ్యులకు సరిగ్గా సమాచారం ఇవ్వట్లేదంటూ విపక్షాలు అసహనం వ్యక్తం చేశాయి. శాసనసభ నడుపుతున్న తీరుపై విపక్షాలు తీవ్రంగా ఆక్షేపించాయి. సమాచారం లేకుండానే ఆర్థిక పరిస్థితిపై చర్చ పెట్టారని విమర్శించాయి. శాసనసభ రూల్స్ ప్రకారం సభ నిర్వహించాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు.
శాసనసభ నడిపే తీరు ఇది కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సభ్యులకు సమాచారం లేకుండా ఎలా మాట్లాడతారని బీజేపీ పక్షనేత మహేశ్వర్‌రెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విపక్ష, అధికార పార్టీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి సభలో గందరగోళం నెలకొంది.
Sridhar Babu Fires On BRS : మరోవైపు విపక్ష సభ్యుల విమర్శలపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. సభ నిర్వహణలో కొంత సమాచార లోపం జరిగిందన్న శ్రీధర్ బాబు దీనికే స్పీకర్ సారీ చెబుతారా? అని మండిపడ్డారు. స్పీకర్ ఆఫీస్ తీసుకునేటువంటి నిర్ణయాలకు అన్ని పార్టీలు కట్టుబడి ఉండాల్సిందేనని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. విపక్షాల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపాటి సమాచార లోపానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు.
‘హరీశ్‌రావు, అక్బరుద్దీన్లు ఇద్దరూ సీనియర్ సభ్యులేనని సమాచార లోపం జరిగిందని తామే చెబుతున్నాం అని శ్రీధర్ బాబు తెలిపారు. అయినా క్షమాపణ చెప్పాలంటున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. వారు ఏదైనా చెప్పాలనుకుంటే రిక్వెస్ట్ చేయాలి కానీ హుకుం జారీ చేయొద్దని శ్రీధర్‌బాబు అన్నారు.
స్పీకర్ ఎందుకు క్షమాపణ చెబుతారు : అతిముఖ్యమైన అంశంపై సభలో చర్చ జరుగుతుండగా పక్కదారి పట్టించేందుకే ఇదంతా చేస్తున్నారని విపక్షాలపై మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. సభ సజావుగా జరగాలని బీఆర్ఎస్ భావించడం లేదని ఆక్షేపించారు. ప్రభుత్వ పరంగా ఏదైనా పొరపాటు జరిగితే సంబంధిత శాఖ మంత్రిగా తాను బాధ్యత తీసుకుని జవాబుదారిగా ఉంటానని తెలిపారు. అంతేకానీ స్పీకర్ క్షమాపణ చెప్పాలంటే ఎలా సాధ్యం అవుతుందని విపక్షాలను శ్రీధర్ బాబు ప్రశ్నించారు.
ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై విచారణ కోసం సిట్ - అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటన
'ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం తగదు' : హరీశ్‌రావుపై శ్రీధర్‌బాబు సీరియస్