Assembly 3rd Day Session : లగచర్ల ఘటన, రైతుకు బేడీలు వేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన రెండో రోజూ కొనసాగింది. శాసనసభకు నల్లదుస్తులు, బేడీలతో వచ్చిన ప్రజాప్రతినిధులు శాసనసభలో నిరసన తెలిపారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లుపై చర్చను ప్రారంభించగా లగచర్లపై చర్చించాలని ఆందోళన చేశారు. నినాదాలతో హోరెత్తించారు. బీఆర్ఎస్ సభ్యుల వైఖరిని ఖండించిన మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, విప్ ఆదిశ్రీనివాస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు బేడీలు వేసింది మీరేనంటూ ఎదురుదాడికి దిగారు.
వికారాబాద్ జిల్లా లగచర్ల రైతుకు బేడీలు వేసి అవమానించారంటూ శాసనసభ వేదికగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. సోమవారమే లగచర్ల అంశంపై చర్చకు శాసనసభలో బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టారు. లగచర్ల రైతులకు సంఘీభావంగా నల్ల రంగు దుస్తులు, బేడీలు ధరించి సభలకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు రైతులను జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని నిరసన తెలిపారు. ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు నిరసన కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
లగచర్ల అంశంపై పట్టు : ప్రశ్నోత్తరాల తర్వాత విరామం అనంతరం ప్రారంభమైన శాసనసభలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వర్సిటీ బిల్లుపై చర్చను చేపట్టగా బీఆర్ఎస్ శాసనసభ్యులు లగచర్ల, గుండెనొప్పి వచ్చిన రైతుకు బేడీలు వేసిన అంశంపై చర్చకు పట్టుపట్టారు. నినాదాలతో హోరెత్తించారు. రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సభ్యుల నినాదాల మధ్యే మూడు బిల్లులకు ఆమోదం తెలిపిన శాసనసభ పర్యాటక విధానంపై చర్చను ముగించింది.
మీకు అర్హతే లేదు! : శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల తీరును తప్పుపట్టిన మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, రైతుల గురించి మాట్లాడే అర్హతే బీఆర్ఎస్కు లేదన్నారు. లగచర్ల బేడీల ఘటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకున్నా బీఆర్ఎస్ సభ్యులు నిరసన చేపట్టడంలో అర్థం లేదని పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క మండిపడ్డారు. కేసీఆర్ సర్కారు హయాంలో అనేక సార్లు రైతులకు బేడీలు వేశారన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కనీసం అధికారులపైనా కూడా చర్యలు తీసుకోలేదని ఎదురుదాడికి దిగారు.
లగచర్ల అంశంపై బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్యే పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చను ముగించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను బుధవారానికి(డిసెంబరు 18) వాయిదా వేశారు. శాసనమండలిలోనూ బీఆర్ఎస్ సభ్యులు ఇదే తరహా ఆందోళనలు కొనసాగించారు. పర్యాటక విధానంపై స్వల్ప కాలిక చర్చను కొనసాగించగా లగచర్ల అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఆందోళనతో సభను బుధవారానికి మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వాయిదా వేశారు.
కేసీఆర్ పాలనలో 'ఇరిగేషన్' పెరిగితే - రేవంత్ పాలనలో 'ఇరిటేషన్' పెరిగింది: హరీశ్ రావు