Harish Rao on Farmers Problems : గత పది సంవత్సరాల్లో నీటి కొరతతో ఇబ్బందులు పడని రైతులు నేడు సాగుకు నీరులేక అల్లాడిపోతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సాగు నీరు లేక, కరెంటు ఎప్పుడు వస్తుందో తెలీక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని తెలిపారు. రాష్ట్ర రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఈ విషయం పట్టడం లేదని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర పార్టీల చేరికలపై తప్ప రైతుల గురించి ఆలోచన లేదన్నారు. రైతులు కష్టాల్లో ఉంటే బ్యాంకుల వాళ్లు అప్పుల గురించి నోటీసులు ఇస్తున్నారని, అన్నదాతలను ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు.
"రుణమాఫీపైనే మొదటి సంతకం చేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. వంద రోజులైనా రేవంత్‌రెడ్డి రుణమాఫీపై నిర్ణయం తీసుకోలేదు. రైతులకు ఇచ్చిన నాలుగు హామీలు ఇప్పటివరకు అమలు చేయలేదు. 4 నెలల్లో ఏం సాధించారని లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారు?. సీఎం ప్రతిపక్ష నేతల ఇళ్లకు వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు." - హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
వడగళ్ల వానలు, ప్రభుత్వం నీటినిర్వహణ లోపం వల్ల కానీ, కరెంటు సరఫరా లోపాల వల్ల కానీ కారణాలు ఏవైనా నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే రైతులకు ఎకరానికి రూ.25,000లు ఇచ్చి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాలకు, సహాయక చర్యలకు ఎన్నికల కోడ్ అడ్డురాదని తెలిపారు. రుణాల విషయాల్లో రైతులను ఇబ్బంది పెడుతున్న బ్యాంకర్లపై చర్యలు తీసుకోవాలన్నారు.