Balineni Srinivasa Reddy resigned to YSRCP in AP :ఏపీలో వైఎస్సార్సీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపారు. జగన్ విధానాలు నచ్చకే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఒంగోలులో బాలినేని మీడియాతో మాట్లాడారు. ‘కొన్ని రోజులుగా వైఎస్సార్సీపీ అధిష్ఠానం వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నాను. గురువారం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలవబోతున్నాను. ఆ పార్టీలో చేరబోతున్నాను’ అని బాలినేని తెలిపారు.
"రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు. వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితుడుని అయినా ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిని రాజకీయ నిర్ణయాలు సరిగా లేనపుడు కచ్చితంగా అడ్డుకున్నా. ఎలాంటి మొహమాటాలకు నేను పోలేదు. అంతిమంగా ప్రజాతీర్పుని ఎవరైనా హుందాగా తీసుకోవాల్సింది. నేను ప్రజా నాయకుడిని, ప్రజల తీర్పే నాకు శిరోధార్యం, రాజకీయాల్లో భాష గౌరవంగా హుందాగా ఉండాలని నమ్మే నిఖార్సైన రాజకీయం చేశాను, కారణం లక్షల మంది ప్రజలు మనల్ని ఆదర్శంగా తీసుకున్నపుడు అన్ని విధాలా విలువలను కాపాడాల్సిన బాధ్యత మనదే." - బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి