KTR on ED Notices in E Formula car Race : ఏసీబీ కేసు, ఈడీ నోటీసును న్యాయపరంగా ఎదుర్కొంటానని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. ఫార్ములా - ఈ రేస్ కేసు ఏసీబీ పెట్టిన అవినీతి లేని మొదటి కేసు అని పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఏడాదిగా ప్రయత్నించి తనపై ఆరో అంశంపై కేసు పెట్టారని తెలిపారు. ఫార్ములా-ఈ రేసుకు అప్పుడు మంత్రిగా తాను అనుమతిస్తే ఇప్పుడు రద్దు చేశారని చెప్పారు. తాను తప్పు చేస్తే సీఎం రేవంత్‌రెడ్డిది ఎలా ఒప్పు అవుతుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లపై త్వరలో సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు.
ఈ సంవత్సరంలోనే ఉప ఎన్నికలు రావచ్చని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేస్తోందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు భరోసాతో రైతుల నుంచి తిరుగుబాటు వస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్ తమ ట్రంప్ కార్డు, ప్రజల్లోకి ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసని వ్యాఖ్యానించారు. జడ్జి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదని తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్ విషయంలో రూ.12 వేల కోట్లు నష్టం చేస్తున్నారని, ఖాజాగూడ భూములపై కన్నేసి పేదలను రోడ్డుపాలు చేశారని ఆరోపించారు. రూ.1.38 లక్షల కోట్లు అప్పు చేసి దిల్లీకి రూ. వేల కోట్లు పంపుతున్నారని వ్యాఖ్యానించారు.
'ఫార్ములా- ఈ రేసుపై ఏసీబీ పెట్టిన కేసు అవినీతి లేని మొదటి కేసు. ఏసీబీ కేసు, ఈడీ నోటీసును నేను న్యాయపరంగా ఎదుర్కొంటా. ఇప్పుడు దిల్ రాజువి రెండు సినిమాలున్నాయి. ఆయన బాధ ఆయనది'- కేటీఆర్, మాజీమంత్రి
ఫిబ్రవరి లేదా మార్చిలో బీఆర్‌ఎస్ బహిరంగ సభ : తనపై ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ స్పందించారు. నిర్మాత దిల్ రాజువి రెండు సినిమాలున్నాయని, ఆయన బాధ ఆయనదని కేటీఆర్ అన్నారు. ఫిబ్రవరి లేదా మార్చిలో పార్టీ బహిరంగ సభ ఉంటుందని స్పష్టం చేశారు. వేసవి కాలం నుంచి పార్టీ సభ్యత్వ నమోదు ఉంటుందని తెలిపారు. అక్టోబర్‌లో బీఆర్‌ఎస్ అధ్యక్షుడి ఎన్నిక కూడా ఉంటుందని వెల్లడించారు. కేసీఆర్‌ను పార్టీ అధ్యక్షునిగా మొదట తానే ప్రతిపాదిస్తానని తెలిపారు.
సినిమా వాళ్లతో సెటిల్మెంట్ చేసుకొని ఇప్పుడు మాట్లాడట్లేదు : కేటీఆర్
'నేను ఏ తప్పు చేయలేదు భయపడేది లేదు - న్యాయపరంగా ఏం చేయాలో అది చేస్తాం : కేటీఆర్