Dead Man Alive After Ambulance Hits Pothole : రోడ్డుపై గుంతలు ఉంటే వాహనాల్లో ప్రయాణించే వారికి కుదుపుల ధాటికి ఒక్కోసారి ప్రాణాలు పోయినంత పని అవుతుంది. కానీ ఆ గుంతల్లో మృతహాన్ని తరలించినప్పుడు, ప్రాణాలు తిరిగి వస్తే ఎంత బాగుంటుందో కదా! మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో అలాంటి ఘటనే జరిగింది. ఓ 65 ఏళ్ల వ్యక్తికి గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్తే మృతిచెందాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకొస్తుండగా రోడ్డుపై ఉన్న ఓ గుంత వల్ల వాహనం ఓ చోట కుదుపునకు గురైంది. దీంతో అతడి శరీరంలో కదలికలు వచ్చి మళ్లీ బతికాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా జరిగింది ఇదే. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలు ఏం జరిగిందంటే?
కొల్హాపూర్‌నకు చెందిన పాండురంగ్ డిసెంబర్ 16న ఇంట్లో విఠల్ భగవాన్ నామాన్ని జపిస్తున్నాడు. అకస్మాత్తుగా అతడికి చెమటలు పట్టాయి. అనంతరం గుండెపోటుకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను కస్బా బావ్డాలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మరో ఆస్పత్రికి సిఫారసు చేశారు. అనంతరం కుటుంబీకులు మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పాండురంగ్‌ను పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
పాండురంగ్ మరణవార్త తెలుసుకున్న బంధువులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. గ్రామస్థులంతా పాండురంగ్ ఇంటికి చేరుకొని మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు. ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తీసుకొస్తుండగా మధ్యలో ఓ గుంత వచ్చింది. అది గమనించని డ్రైవర్ వేగంగా వెళ్లిపోవడం వల్ల వాహనం కుదుపునకు గురైంది. అంతే అతడి శరీరంలో చలనం మొదలైంది. చిన్నగా చేతులు కదపడం గమనించిన కుటుంబీకులు అదే అంబులెన్స్‌లో వేరే ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో పాండురంగ్‌ను చూసి వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాక పాండురంగ్ గుండె సాధారణంగా కొట్టుకోవడం ప్రారంభించింది. అనంతరం అతడి పరిస్థితి నిలకడగా ఉందని, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. రెండు రోజుల్లో అతడి పరిస్థితి క్రమంగా మెరుగుపడింది. బుధవారం ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ పాండురంగ్‌కు కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. అయితే కొన్నిసార్లు ఇలా జరుగుతుందని కార్డియాక్ ఎక్స్పర్ట్ డాక్టర్ స్నేహదీప్ పాటిల్ తెలిపారు.