KTR On DSC Jobs in Telangana : ప్రజాపాలనలో నిరుద్యోగుల కలలు కల్లలయ్యాయని కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. 60 వేల మందికి నియామకపత్రాలను అందించామని, అది కాంగ్రెస్ ఘనత అంటూ సీఎం ప్రకటించటాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. ఈరోజు నియామపకపత్రాలు అందుకోనున్న ఉపాధ్యాయులు మొదలు ఇటీవల జరిగిన అన్ని నియామకాలు కలిపితే 40వేలు దాటలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఒక్క నోటిఫికేషన్‌కు సంబంధించిన ప్రక్రియ కూడా పది నెలల్లో పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు. 25,000 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ఇస్తామని ఎన్నికల్లో ప్రకటించిన సర్కారు, కేవలం 11,066 నియామకాలకు తగ్గించిందని ఎత్తి చూపారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌కు 6,000 పోస్టులు జోడించి ఈ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 30,000 వేల నియామక పత్రాలకు సంబంధించిన నోటిఫికేషన్‌లు, పరీక్షలు, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లు బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలోనే పూర్తి చేశామన్నారు. కేవలం అపాయింట్‌మెంట్ ఆర్డర్లు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీలను గాలికి వదిలేసినట్లే ప్రభుత్వం నిరుద్యోగులనూ మోసం చేసిందని ఘాటుగా వ్యాఖ్యానించిన కేటీఆర్, ఎన్నికల హామీ ప్రకారం ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
యువతను పిచ్చోళ్లను చేస్తున్నారా? :ఈ ముఖ్యమంత్రిని చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడని అనిపిస్తుందని కేటీఆర్ ఆక్షేపించారు. ఉద్యోగ నియామకాలపై మరీ ఇంత నీతిమాలిన ప్రచారమా? అంటూ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. ప్రజా ధనాన్ని తగలేసి ఫ్రంట్ పేజీల్లో పచ్చి అబద్ధాలతో ప్రకటనలా? అని సూటిగా ప్రశ్నించారు. గత ప్రభుత్వ ఉద్యోగాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడానికి కొంచెమైనా సిగ్గుండాలి కదా! అని ఎద్దేవా చేశారు. తెలంగాణ యువతను పిచ్చోళ్లను చేస్తున్నారా? అశోక్ నగర్ చౌరస్తాకు ఉస్మానియా క్యాంపస్‌కు పోయి చెప్తారా కొలువుల పండుగ కథలు? ఏంటని విమర్శించారు. ఏడాదిలో రెండు లక్షల కొలువులు గ్యారెంటీ అని, నిరుద్యోగుల చెవుల్లో పువ్వులు పెట్టింది చాలక తప్పుడు లెక్కలతో తప్పుదోవ పట్టించడం దుర్మార్గం అని ఆరోపించారు.