Inauguration Of Telangana Pavilion AT WEF : ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరం) శిఖరాగ్ర సదస్సులో భాగంగా దావోస్‌లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం అక్కడ తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రులు చిరాగ్ పాశ్వాన్, జయంత్ చౌదరీలతో రేవంత్ రెడ్డి బృందం సమావేశమైంది. తెలంగాణకు సంబంధించిన పలు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చించింది. మరోవైపు దావోస్‌లో పలు అంతర్జాతీయ సీఈవోలతో రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు భేటీ అవ్వనున్నారు.
జై బాపు, జై భీం, జై సంవిధాన్ ర్యాలీకి రాష్ట్ర నాయకులు : మరోవైపు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సహా 10 మంది మంత్రులు, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీ చంద్ రెడ్డి, గిడుగు రుద్రరాజులు కూడా ఇవాళ కర్ణాటక రాష్ట్రం బెలగావి వెళ్లారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, రాజీనామాకు డిమాండ్ చేస్తూ గత నెల 27వ తేదీన బెల్గాంలో నిర్వహించాల్సిన జై బాపు, జైభీం, జై సంవిధాన్ ర్యాలీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆకస్మిక మృతితో వాయిదా పడింది.
ఆ ర్యాలీని ఈ నెల 21వ తేదీన నిర్వహించాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఆ ర్యాలీలో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి అందుబాటులో ఉన్న మంత్రులంతా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లుగా పీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఉదయం 9 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ర్యాలీలో పాల్గోనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు : భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనర్సింహ, సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు, సీడబ్ల్యుసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి, ఏపీ మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజులులు ప్రత్యేక విమానంలో వెల్లినట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి. బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లిన వీరు బెల్గాంలో నిర్వహించనున్న జై బాపు, జైభీం, జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రపంచ దేశాలు రాష్ట్రం వైపు తలెత్తి చూసే సమయం ఆసన్నమైంది - సింగపూర్ మీట్ అండ్ గ్రీట్‌లో సీఎం రేవంత్
పెట్టుబడుల వేటలో సీఎం బృందం - రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఇదే