Harish Rao letter to Congress government:గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళన, ఆవేదన ప్రభుత్వం అర్థం చేసుకొని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటుందని ఎదురుచూసినట్లు మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీష్ రావు లేఖ రాశారు. ఆశలు అడియాశలు చేసేలా, నిరాశలోకి నెట్టేసేలా గ్రూప్ అభ్యర్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, సమస్యల గురించి ఎలాంటి చర్చ లేకుండా ఉసూరుమనిపించారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా, కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగాల ప్రక్రియకు సంబంధించిన నియమాక పత్రాలు ఇచ్చారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. మిమ్మల్ని నమ్మి అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం రోడ్డున పడి అలమటించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు. గ్రూప్ వన్, డీఎస్సీ తదితర ఉద్యోగాల కోసం చేపట్టిన నియామక ప్రక్రియ కూడా ఉద్యోగార్థులకు చాలా ఇబ్బంది కరంగా మారిందని పేర్కొన్నారు. నిరుద్యోగుల విజ్ఞప్తిని కనీసం వినే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.
గ్రూప్ వన్ మెయిన్స్‌కు 1:100 నిష్పత్తితో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయని హరీష్ రావు పేర్కొన్నారు. అందువల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని తెలిపారు. సీఎల్పీ నేతగా నాడు భట్టి విక్రమార్క ఇదే డిమాండ్ చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు తప్పుకుంటుందో అర్థం కావడం లేదని వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉంటే ఒకమాట ఆధికారంలో ఉంటే వేరొకమాటగా ప్రవర్తించడం ఎందుకని ప్రశ్నించారు. గ్రూప్ 2కు 2000 ఉద్యోగాలు, గ్రూప్ 3కి 3000 ఉద్యోగాలు కలుపుతామన్న మాటను నిలుపుకోవాలని డిమాండ్ చేశారు.
గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక 'కీ' విడుదల - TGPSC Group1 Prelims Key Released