Former CM KCR Press Meet at Sircilla : ఈ ప్రభుత్వానికి నీటి నిర్వహణ సామర్థ్యం లేదు, తెలియదని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో గత పదేళ్లలో మేము సజీవ జలధారలు సృష్టించామన్నారు. గత ఏడేళ్లు చెక్‌డ్యామ్‌లు నిరంతరం నీళ్లతో కళకళలాడేవని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా పొలం బాట(Polam Bata) కార్యక్రమంతో ఎండిన పంటలను పరిశీలించిన అనంతరం సిరిసిల్లలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
కాకతీయ కాలువలో ఏడాదిలో 10 నెలలు నీళ్లు ఉండేవని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. గోదావరి నది 200 కిమీ మేర సజీవ జలధార కనిపించేదని, గత ఎనిమిదేళ్లు ప్రజలు ఆ ఫలాలను అనుభవించారని పేర్కొన్నారు. ఇప్పుడు 4 నెలల్లోనే ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూస్తున్నామని చెప్పారు. 2014కు ముందు ఏ పరిస్థితి ఉండేదో ఇప్పుడు మళ్లీ ఆ పరిస్థితి చూస్తున్నామని కేసీఆర్(KCR) వివరించారు. ఈ ప్రభుత్వ అసమర్థ, తెలివితక్కువతనం వల్ల ఈ పరిస్ధితి వచ్చిందని ధ్వజమెత్తారు.
KCR Polam Bata at Karimnagar :మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ ఆరోపించారు. ఇది కాలం తెచ్చిన కరవా, కాంగ్రెస్ తెచ్చిన కరవు అంటూ దుయ్యబట్టారు. 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని తెలిపారు. ఈ ప్రభుత్వానికి నీటి నిర్వహణ సామర్థ్యం లేదు, తెలియదన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇవాళ పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. లోటు వర్షపాతం వల్ల పంటలు ఎండిపోయాయని మంత్రులు చెబుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.
KCR Comments on CM Revanth Reddy :గతేడాది లోటు వర్షపాతం అనేది వాస్తవం కాదు, గతేడాది వర్షాలు ఎక్కువగా పడ్డాయని కేసీఆర్ అన్నారు. ఆత్మహత్య చేసుకున్న 209 మంది రైతుల వివరాలను సీఎస్‌కు పంపించామని వివరణ ఇచ్చారు. సీఎం అడిగిన 4 గంటల్లోనే రైతుల వివరాలను సీఎస్‌కు పంపించామని స్పష్టం చేశారు. రైతుల కుటుంబాలను ఆదుకోకపోతే ఈ ప్రభుత్వానికి ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు.