Congress Exercise for New TPCC Leader : ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, పార్టీ సారథిగా పదవీ కాలం సైతం ముగియడంతో కాంగ్రెస్కు నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర బృందంతో అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సమాలోచనలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఉమ్మడి సమావేశంతో పాటు విడివిడిగా మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నట్లు సమాచారం. విస్తృత చర్చలు జరిగినా అధిష్ఠానం తుది నిర్ణయానికి రాకపోయినప్పటికీ, క్రియాశీలకంగా ఉండే వ్యక్తిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పీసీసీ అధ్యక్ష పదవి నిర్ణయం తర్వాత మంత్రివర్గ విస్తరణలో సామాజిక కూర్పు ఆధారపడి ఉంటుందని సమాచారం. 2, 3 రోజుల్లోనే పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, వెంటనే మంత్రి పదవులకు పేర్లు ఖరారు కావొచ్చని తెలుస్తోంది. జులై నెలలోనే కసరత్తు జరిగినా ఆషాఢమాసం కారణంగా ఆగింది. రాష్ట్రంలో గత ఏడాది డిసెంబరు 7న కొలువుదీరిన మంత్రివర్గంలో 12 మందికే పదవులివ్వగా మరో ఆరుగురికి చోటు కల్పించే అవకాశం ఉంది. ఈ మేరకు పదవులను ఆశించేవారి నుంచి ఒత్తిడి పెరగడంతో సామాజికవర్గాల మధ్య సమతౌల్యం పాటిస్తూ, ఒకేసారి పీసీసీ అధ్యక్షుడు, మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం.
మహేశ్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు? :పీసీసీ అధ్యక్ష పదవికి బీసీ సామాజికవర్గం నుంచి ప్రస్తుత కార్యనిర్వహక అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్, ఎస్సీ సామాజికవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎస్టీల నుంచి ఎంపీ పోరిక బలరాం నాయక్ పేర్లను రాష్ట్ర నాయకులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. వీరిలో లక్ష్మణ్ కుమార్, బలరాం నాయక్, మహేశ్ గౌడ్లలో ఒకరికి మెరుగైన అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే రాష్ట్రానికి చెందిన ముగ్గురు నాయకులు కోర్ కమిటీ సభ్యులుగా చెప్పే అభిప్రాయం మేరకు ఎంపిక జరుగుతుందని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. నూతన పీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపినట్లు ప్రచారం జరిగినప్పటికీ, అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.