Congress Leader VH Car Accident In Hyderabad : పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. హైదరాబాద్ అంబర్‌పేటలోని వీహెచ్ ఇంటి ముందు పార్క్ చేసిన కారును బుధవారం తెల్లవారుజామున దుండగులు ఓ వాహనంతో ఢీ కొట్టారు. భారీ శబ్ధం రావటంతో వాచ్మెన్ బయటకు వచ్చి చూడగా, ఎరుపు రంగు కారు వెనక్కి తీసుకొని పారిపోయారని తెలిపారు. వీహెచ్ ఫిర్యాదుతో అంబర్‌పేటలోని ఆయన నివాసానికి వచ్చిన పోలీసులు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
వీహెచ్ ఇంట్లో ఉన్న కెమెరాలతో పాటు చుట్టుపక్కల ఉన్న అన్ని సీసీ కెమెరాలను పరిశీలించారు. కారు నంబర్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. తాగిన మత్తులో ఇది జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి అని వీహెచ్ తెలిపారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా వి.హనుమంతరావు ఇంటి ముందు ఉన్న కారుపై గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడి చేశారు.
వీహెచ్ ఇంటిపై రాళ్ల దాడి.. కారు ధ్వంసం.. సీసీ దృశ్యాలు వైరల్..