BRS Leader Niranjan Reddy Comments on Runa Mafi :రూ.2 లక్షల రుణమాఫీ ఎవరికి చేస్తారో మండలాలు, గ్రామాల వారీగా జాబితా ప్రకటించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతుల రుణాలు, రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్న వారి వివరాలు ప్రభుత్వం వెల్లడించాలని అడిగారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలకు ముందు కారు కూతలు కూసిన కాంగ్రెస్ నేతలు, నేడు కోతలు విధిస్తున్నారని, ఏప్రిల్, మే నెల ఫించన్లు కూడా ఇవ్వలేదని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. సీజన్ ప్రారంభం అయినా రైతుభరోసా ఇవ్వడం లేదని, కుంటిసాకులు చెబుతున్నారని మండిపడ్డారు. మిగిలిన రుణమాఫీ అంతా చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పెండింగ్‌లో ఉన్న రూ.4,000 కోట్ల రుణాల మాఫీ విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అడిగారు. ఎన్నికల నాటికి మిగిలిన రుణమాఫీ ఇస్తారా ఇవ్వరా చెప్పాలని ప్రశ్నించారు.
ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేలకు మించి రుణాలు ఇవ్వరని, ఐదెకరాలలోపు ఉండి రూ.2 లక్షలు ఎంతమంది రుణం తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని నిరంజన్ రెడ్డి అడిగారు. బోనస్ బోగస్ అని అందరికీ అర్థమైందని, కేసీఆర్ తరహాలో రైతుబంధు ఇచ్చినా మేలని రైతులు అంటున్నారని పేర్కొన్నారు. హేతుబద్దీకరించి అందరికీ కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని అంటున్నారని, ఈ విషయాన్ని ఎన్నికల సమయంలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.