DK Aruna Comments on Revanth Reddy : పాలమూరు జిల్లా ప్రజల ఆశీస్సులతో రాజకీయంగా ఎదిగిన కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి నేడు ఇద్దరు తోడు దొంగలై జిల్లాను భ్రష్టు పట్టించారని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఓటేస్తే ఓటు మురిగిపోయినట్టేనని విమర్శించారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదరిగుడా, కొందుర్గు, ఫరూక్ నగర్ మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.
పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇప్పించలేదని తనపై అవాకులు చవాకులు మాట్లాడితే ఏదైనా సంబంధం ఉందా అని డీకే అరుణ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఒక్కో దగ్గర ఒక్కోలాగా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్‌లో పోటీ చేస్తున్న మహిళలను గెలిపించాలని కోరుతూ మహబూబ్‌నగర్ పాలమూరు ఆడబిడ్డను అయిన తనను ఓడించాలని కోరడం ఏంటని విమర్శించారు. రేవంత్‌కు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు రాజకీయ భవితవ్యాన్ని ఇచ్చారని, నేడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం చేశారని ప్రశ్నించారు.
ఇద్దరి ఆలోచన విధానాలు ఒక్కటే :మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన విధానాల్లో ఇద్దరు ఒకటేనని, ఇద్దరు కలిసి పాలమూరు జిల్లాను దోచుకునేందుకు వెనకాడబోరని డీకే అరుణ ఆరోపించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చిందని, వాటిని ఎందుకు నెరవేర్చడం లేదని ఆమె ప్రశ్నించారు. ఈ ఎన్నికలు దేశం కోసం ధర్మం కోసమని, ఆడబిడ్డ అయిన తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.