Sam Altman Sexual Abuse Allegations : ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ వివాదంలో చిక్కుకున్నారు. శామ్ ఆల్ట్‌మన్ తనపై దశాబ్ద కాలం పాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని స్వయానా ఆమె సోదరి ఆరోపించారు. ఈ మేరకు మిస్సోరీ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశారు. మరోవైపు ఈ ఆరోపణలను ఖండిస్తూ శామ్, ఆయన తల్లి, సోదరులు కలిసి ఓ ప్రకటనను విడుదల చేశారు.
'ఆమె మానసిక స్థితి సరిగా లేదు. తన ఆరోగ్యంపై మేం చాలా ఆందోళనకు గురవుతున్నాం. మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న ఓ కుటుంబ సభ్యురాలిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టమైన పనే. కానీ, ఆమెకు అండగా ఉండేందుకు మేం చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తూ ఉన్నాం. ఆర్థికంగానూ సాయం చేస్తున్నాం. ఇవన్నీ చేసినా కూడా మమ్మల్ని ఇంకా డబ్బు కోసం డిమాండ్ చేస్తూనే ఉంది. మా కుటుంబంపై, ముఖ్యంగా శామ్‌పై అసత్య ఆరోపణలు చేసి మరింత ఎక్కువ బాధ పెట్టింది. ఆమె గోప్యత దృష్ట్యా బహిరంగంగా స్పందించకూడదు అని అనుకున్నాం. కానీ, ఇప్పుడు ఆమె శామ్‌పై కోర్టుకు వెళ్లడం వల్ల ఈ ప్రకటను విడుదల చేయాల్సి వచ్చింది' అని ప్రకటనలో శామ్ కుటుంబం వెల్లడించింది.
మూడేళ్ల ప్రాయం నుంచే లైంగిక వేధింపులు
తనకు మూడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే అన్న శామ్ నుంచి లైంగిక వేధింపులకు గురవుతూ వచ్చానని, ఆమె మిస్సోరీ డిస్ట్రిక్ట్ కోర్టులో వేసిన దావాలో పేర్కొన్నారు. 'మిస్సోరీలోని క్లేటన్‌లో ఉన్న మా ఇంట్లోనే నేను వేధింపులను ఎందుర్కొన్నా. నాకు అప్పుడు మూడేళ్లు. శామ్‌కు 12 ఏళ్లు. 1997 నుంచి 2006 వరకు నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వారానికి అనేక సార్లు ఈ దురాగతాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. ఆ దారుణమైన అనుభవాల కారణంగా నేను తీవ్ర ఒత్తిడికి లోనై మానసికంగా కుంగిపోయా. ఆ డిప్రెషన్ భవిష్యత్తులోనూ కొనసాగుతుందేమో' అని శామ్ సోదరి తన దావాలో తెలిపారు. అయితే గతంలోనూ శామ్‌పై ఎక్స్ వేదికగా ఇలానే ఆరోపణలు చేశారు. అయితే, ఈసారి కోర్టును ఆశ్రయించడం వల్ల ఆయన విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ సృష్టికర్త, ఓపెన్ ఏఐ సంస్థ సీఈఓగా శామ్ ఆల్ట్‌మన్ ఇటీవల ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. గత ఏడాది ఆయనను తొలగించడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఉద్యోగులు, వాటాదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటం వల్ల కంపెనీ బోర్డు ఆయన్ని తిరిగి తీసుకుంది. గతేడాది ఆరంభంలో తన బాయ్‌ఫ్రెండ్ ఆలివర్ మల్హెరిన్‌ను ఆయన వివాహం చేసుకున్నారు.