Woman Files Police Complaint Over Cat Death : పశువైద్యశాఖ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తన పెంపుడు పిల్లి మృతి చెందిందంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే చేవెళ్లలోని అల్లవాడకు చెందిన పౌజియా బేగం చంద్రారెడ్డినగర్ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. 5 నెలల వయసున్న పిల్లిని ఆమె పెంచుకుంటుంది. ఈ క్రమంలోనే 4 రోజుల క్రితం పిల్లి అనారోగ్యానికి గురైంది.
వైద్యం వికటించి మరణించిన పిల్లి! : దీంతో పౌజియా బేగం తన పెంపుడు పిల్లిని మంగళవారం చికిత్స కోసం చేవెళ్ల ప్రభుత్వ పశువైద్యశాలకు తీసుకెళ్లారు. విధుల్లో ఉన్న ఒప్పంద ఉద్యోగి పిల్లికి నట్టల నివారణ, జ్వరం మందులిచ్చాడు. అనంతరం ఇంటికి తీసుకెళ్లిన కొంతసేపటికే పిల్లి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆమె పిల్లిని మళ్లీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పుడు విధుల్లో ఉన్నటువంటి వెటర్నరీ అసిస్టెంట్, సిబ్బంది పిల్లికి ఇంజక్షన్ చేయగా కొంత సమయానికే పిల్లి మరణించింది.
పిల్లి మృతిపై పోలీసులకు మహిళ ఫిర్యాదు : తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న పెంపుడు పిల్లి మృతి చెందడంతో పౌజియా బేగం బోరున విలపించింది. తన పిల్లి మృతికి పశువైద్యశాఖ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పశువైద్యాధికారి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ సంయుక్త సంచాలకుడు విజయకుమార్ ఘటనపై విచారణకు ఆదేశించారని, శవ పరీక్ష కోసం పిల్లి కలేబరాన్ని భద్రపరిచినట్లుగా తెలిపారు. బుధవారం పోస్టుమార్టం నిర్వహిస్తామని వివరించారు. సిబ్బంది నిర్లక్ష్యమని తేలితే శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని చెప్పారు.
కుక్క చనిపోయిందని.. చంపిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు కేసు!