CPI Meeting in Support of Congress MP Candidate Danam Nagender : దేశంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాల్లేవు అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. పదేళ్లు కమలానికి అధికారం ఇస్తే, రాజ్యాంగ వ్యవస్థలు అన్నింటిని సర్వనాశనం చేశారన్నారు. మళ్లీ అవకాశం ఇస్తే, ఏక వ్యక్తి నియంత్రణ వస్తుందని ఆయన ఆరోపించారు.
CPM Support to Congress Party :మొన్నటి వరకు 400 సీట్లు వస్తాయి అన్న బీజేపీ ఇప్పుడు నమ్మకం లేక ఆ విషయాన్ని ప్రస్తావించడం లేదని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సీపీఎం నగర కార్యాలయంలో, సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌కు మద్దతుగా సీపీఎం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి దానం నాగేందర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పుస్తెలతాడు లాక్కుంటారని ప్రధాని నరేంద్ర మోదీ దిగజారుడు మాటలు మాట్లాడడం అభ్యంతరకరమన్నారు.
సికింద్రాబాద్ ఎంపీ స్థానం బీజేపీకి గుండెకాయ వంటిది :ఒక ప్రధాని హోదాలో అలా అనడం తగదు అని హితవు పలికారు. గతంలో కాంగ్రెస్ పరిపాలించింది, అటువంటి ఘటనలేం చోటు చేసుకోలేదన్నారు. దేశంలో అంబానీ, అదానీలను మాత్రం అభివృద్ధి చేశారు కానీ, సాధారణ ప్రజలను ఏమాత్రం పట్టించుకోలేదని రాఘవులు మండిపడ్డారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం భారతీయ జనతా పార్టీకి గుండెకాయ వంటిదని, ఇక్కడ కచ్చితంగా కాంగ్రెస్‌ను గెలిపిద్దామని ఆయన పిలుపునిచ్చారు.
"అత్యంత గొప్ప చరిత్ర గల తెలంగాణ రాష్ట్రంలో లౌకికవాద శక్తులకు తప్ప, మతోన్మాద శక్తులకు తోవలేకుండా చేయాలని చెప్పి మేము కృతనిశ్చయంతో ఉన్నాం. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనలో వారు చేస్తున్న ప్రసంగాలు ప్రధానమంత్రి స్థాయికి తగినట్లుగా లేవు. ఇవాళ డబుల్ ఆర్ ట్సాక్స్ అని చెప్పి ముఖ్యమంత్రి మీద వ్యక్తిగత దాడికి పాల్పడ్డారు. అంతకముందు మంగళసూత్రాలు పోతాయని చెప్పి భయభ్రాంతులకు గురిచేశారు. ఇటువంటి దిగజారుడు విధానాలు మానుకుంటే మంచిది."-బీవీ రాఘవులు, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు