Congress Performance in Telangana Lok Sabha Election 2024 :అసెంబ్లీ ఎన్నికల్లో ఓ లెక్క, లోక్‌సభ ఎన్నికలో మరోలెక్క అన్నట్లు ఉంది కాంగ్రెస్ ఓట్లు సాధించిన తీరు. ఆరు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో 64 స్థానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ మిగిలిన నియోజకవర్గాల్లో రెండు, మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు జరిగిన లోక్‌సభ ఎన్నికలో అవే అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీగా ఓటు బ్యాంకును పెంచుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలో గెలిచిన చోట కొన్నింటిలో మాత్రం కాంగ్రెస్ ఓటు షేరింగ్ తగ్గిపోవడం విశేషం.
కాంగ్రెస్‌కు సిటింగ్ ఎమ్మెల్యేలు 64 అసెంబ్లీ స్థానాల్లో ఉన్నారు. అందులో 15 నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికలో ఆధిక్యం చేజారింది. మిగిలిన 49 నియోజకవర్గాలతో పాటు బీఆర్ఎస్ సాధించిన 12 స్థానాలు, బీజేపీ, సీపీఐ, ఎంఐఎం సాధించిన ఒక్కో స్థానంలో కూడా పార్లమెంటు ఎన్నికలో మెజార్టీ లభించింది. ఇలా మళ్లీ 64 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆధిక్యం సాధించింది. ఇందులో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్ లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.
నిజామాబాద్ :ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. కానీ దీని పరిధిలోని నిజామాబాద్ అర్బన్, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం విజయం సాధించింది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిలైంది ఇక్కడ. కానీ పార్లమెంటు ఎన్నికలో మాత్రం అధికంగా ఓట్లు సాధించి మొదటిస్థానం సంపాదించడం విశేషం. అప్పుడు నిజామాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్ 15 వేల ఓట్ల తేడాతో ఓడిపోగా, ఇప్పుడు 15,800 ఓట్ల ఆధిక్యం సాధించింది. జగిత్యాలలో అసెంబ్లీ ఎన్నికలో 16 వేల ఓట్లు తేడాతో ఓడిపోగా, ఇప్పుడు లోక్‌సభలో 76,145 స్థానాలు గెలుచుకుని అగ్రస్థానం సంపాదించింది. కానీ నిజామాబాద్ రూరల్‌లో అసెంబ్లీలో 78 వేల ఓట్లోస్తే ఇప్పుడు అది 56,674కి పడిపోయింది.
మెదక్ : మెదక్‌లో కూడా కాంగ్రెస్ పరాజయం పాలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ పరిధిలోని నర్సాపూర్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. కానీ ఇప్పుడు అక్కడే ఎక్కువ ఓట్లు సాధించి మొదటి స్థానం సంపాదించింది. మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఏకంగా 101 శాతం సీట్లు అధికంగా వచ్చాయి. ఇక్కడ శాసనసభ ఎన్నికలో కాంగ్రెస్‌కు 32,568 ఓట్లతో బీఆర్ఎస్, బీజేపీల తరువాత మూడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఏకంగా 65,539 ఓట్లతో రెండో స్థానానికి చేరింది. మెదక్ స్థానంలో అసెంబ్లీలో మెజార్టీ సాధించిన కాంగ్రెస్, ఇప్పుడు లోక్‌సభలో రెండోస్థానంలో నిలిచింది.